లేదంటే చట్టపరమైన చర్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: పిజి మెడికల్ సీట్ల దందా అంటూ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన మీద గవర్నర్ కు తప్పుడు ఫిర్యాదులు చేయడాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఖమ్మంలో గత 20 ఏండ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీలో పిజి అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. యూనివర్సిటీలో పిజి అడ్మిషన్లు జరుగుతున్న కౌన్సిలింగ్ అలాట్ మెంట్ సమయంలోనే తమ కాలేజీలో సీట్లు నిండిపోతుంటాయని, అలాంటప్పుడు తమకు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. “రేవంత్ రెడ్డి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇది పూర్తిగా నిరాధారం. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే సహించేదిలేదు.
ఒక వేళ రేవంత్ రెడ్డి గనక నా కాలేజీలో ఒక్కసీటునైనా బ్లాకు దందా చేసినట్టు నిరూపిస్తే.. నా కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తా. ఒకవేళ నిరూపంచలేని పక్షంలో రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. తన ఆరోపణలను వెనక్కి తీసుకోని పక్షంలో చట్టపరమైన చర్యలకు రేవంత్ రెడ్డి సిద్ధ పడాలి. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న కాలేజీ ప్రతిష్టను మంటగలిపే దుర్మార్గపు చర్యలను తిప్పికొడుతాం.” అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.