Thursday, January 23, 2025

సెమీస్‌లో సింధు, ప్రణయ్

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్ : ప్రతిష్టాత్మకమైన మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, హెచ్.ఎస్.ప్రణయ్‌లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. మరో ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో సింధు, పురుషుల విభాగంలో ప్రణయ్‌లు విజయం సాధించి ముందంజ వేశారు. గంటకు పైగా హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు 2116, 1321, 2220 తేడాతో చైనాకు చెందిన జాంగ్ ఇను ఓడించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు జాంగ్, అటు సింధు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. కాగా, తొలి సెట్‌లో సింధు కీలక సమయంలో పుంజుకుంది.

అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే క్రమంలో సెట్‌ను కూడా దక్కించుకుంది. కానీ రెండో గేమ్‌లో సింధుకు షాక్ తగిలింది. ఈసారి జాంగ్ ఆధిపత్యం చెలాయించింది. అద్భుత ఆటతో సింధును హడలెత్తించింది. అంతేగాక అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు కూడా సర్వం ఒడ్డి పోరాడారు. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన సింధు సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది. సెమీస్‌లో ఇండోనేసియా షట్లర్ మరిస్కాతో సింధు తలపడనుంది. మరోవైపు ప్రణయ్ కూడా క్వార్టర్స్‌లో చెమటోడ్చి నెగ్గాడు. జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటోతో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 2523, 1821, 2118తో విజయం సాధించాడు. ఆరంభం నుంచే పోరు హోరాహోరీగా కొనసాగింది. ఇద్దరు సర్వం ఒడ్డడంతో పోరు యుద్ధాన్ని తలపించింది.

తొలి సెట్‌ను ప్రణయ్, రెండో సెట్‌ను కెంటా దక్కించుకున్నారు. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం ప్రణయ్ ఆధిపత్యం చెలాయించాడు. చివరి వరకు దూకుడుగా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఇదిలావుంటే శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. ఇండోనేసియా ఆటగాడు క్రిస్టియాన్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్‌కు పరాజయం ఎదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News