బాలి: ప్రతిష్ఠాత్మకమైన బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు చిరకాల ప్రత్యర్థి, జపాన్ షట్లర్ యమగూచిని ఓడించింది. హోరాహోరీగా సాగిన పోరులో సింధు 2115, 1521, 2119 తేడాతో యమగూచిను చిత్తు చేసింది. ఆరంభ సెట్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. యమగూచి కూడా పైచేయి సాధించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో యమగూచి ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సింధు తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో మాత్రం సింధుకు చుక్కెదురైంది. ఈసారి జపాన్ స్టార్ పైచేయి సాధించింది. తన మార్క్ షాట్లతో సింధును హడలెత్తించింది. ఇక ఒత్తిడికి గురైన భారత స్టార్ కీలక సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న యమగూచి సెట్‌ను దక్కించుకుంది. ఇక ఫైనల్ సెట్‌లో ఆరంభం నుంచే హోరాహోరీ పోరు సాగింది. ఇటు సింధు అటు యమగూచి సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. అనూహ్య మలుపుల మధ్య సాగిన సెట్ చివరికి సింధు చేతికి చిక్కింది. ఈ సెట్‌లో గెలిచిన సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తుది పోరులో సింధు కొరియా క్రీడాకారిణి సియోంగ్‌తో తలపడనుంది. ఇక 2018లో సింధు ప్రపంచ్ టూర్ ఫైనల్‌ను సాధించి చరిత్ర సృష్టించింది.
PV Sindhu enter into BWF World Tour Finals