కౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మకమైన మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మహిళల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు చైనా క్రీడాకారిణి జెవై వాంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన తుది సమరంలో వాంట్ 1621, 2115, 2115 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో సింధు ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో సెట్‌ను దక్కించుకుంది.
అయితే తర్వాత జరిగిన రెండో సెట్‌లో సింధు తడబడింది. ప్రత్యర్థి వాంగ్ ధాటికి ఎదురు నిలువలేక పోయింది. అద్భుత ఆటను కనబరిచిన వాంగ్ సునాయాసంగా సెట్‌ను దక్కించుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇందులో చివరి వరకు నిలకడగా ఆడిన వాంగ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని భావించిన సింధుకు నిరాశే మిగిలింది. ఫైనల్ ఫొబియా మరోసారి సింధును వెంటాడింది. చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో ఒత్తిడికి తట్టుకోలేక పరాజయం పాలైంది.