Tuesday, March 18, 2025

కేజ్రీవాల్ ‘అద్దాలమేడ’పై పిడబ్లుడి దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలోని నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ బంగళా విస్తరణ నిమిత్తం ఆస్తులు విలీనం చేశారని, భవనం లోపల మార్పులకు చేసిన ఖర్చులకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించవలసిందిగా ఢిల్లీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్ శాఖ (పిడబ్లుడి)ని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) ఆదేశించిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత విజేందర్ గుప్తా శనివారం వెల్లడించారు. ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ 2015 నుంచి నిరుడు అక్టోబర్ మొదటి వారం వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా నివసించిన ఆ బంగళాకు సంబంధించిన అవినీతి ఆరోపణ నేపథ్యంలో బిజెపి దానికి ‘శీష్ మహల్’ (అద్దాల మేడ) అని నామకరణం చేసింది.

ఈ వ్యవహారంపై ఆప్ నుంచి గాని, పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ నుంచి గాని వెంటనే ఎటువంటి స్పందనా రాలేదు. తాను గతంలో దాఖలు చేసిన రెండు ఫిర్యాదులను సివిసి పరిగణనలోకి తీసుకుందని, సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలతో నివేదిక సమర్పించవలసిందిగా పిడబ్ల్యుడిని సివిసి కోరిందని గుప్తా తెలియజేశారు.40 వేల చదరపు గజాల (8 ఎకరాల) విస్తీర్ణంలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించేందుకు భవనం నిబంధనలను కేజ్రీవాల్ ఉల్లంఘించారనే ఆరోపణతో రోహిణి బిజెపి ఎంఎల్‌ఎ విజేందర్ గుప్లా సివిసికి మొదటి ఫిర్యాదు దాఖలు చేశారు.

రాజ్‌పూర్ రోడ్‌లో నంబర్లు 45, 47 ప్లాట్లు (టైప్ 5 ఫ్లాట్లలోని సీనియర్ అధికారులు, న్యాయమూర్తుల నివాసాలు) సహా, రెండు బంగళాలు (8ఎ, 8బి ఫ్లాగ్ స్టాఫ్ రోడ్) సహా ప్రభుత్వ ఆస్తులను కూలగొట్టి, కొత్త నివాసంలోకి విలీనం చేశారని, మొత్తం స్థలం విస్తీర్ణం, ఫ్లోర్ ఏరియా నిష్పత్తి నిబంధనలు ఉల్లంఘించారని, వాటికి సరైన లే అవుట్ ప్లాన్ ఆమోదముద్రలు లేవని గుప్తా ఆరోపించారు. నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లోని బంగళా మార్పులు చేర్పులు, అంతర్గత అలంకరణపై ‘విపరీతంగా ఖర్చు చేశారని గుప్తా తన రెండవ ఫిర్యాదు లేఖలో ఆరోపించారు. ‘భారీ ఎత్తున ఆర్థికపరమైన అవకతవకలు’ జరిగాయని, బంగళాలో విలాసవంతమైన సదుపాయాలపై పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని కూడా గుప్తా ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News