దోహా : ఖతార్‌లో మరణశిక్ష తీర్పు వెలువడ్డ భారత మాజీ నావికాధికారుల విషయంలో కదలిక ఏర్పడింది. గూఢచార్య కార్యకలాపాలకు దిగారని ఎనమండుగురు మాజీ నేవీలపై వెలువడ్డ తీర్పుపై భారత ప్రభుత్వం విచారణకు అప్పీలు చేసింది. ఈ అప్పీలును స్వీకరిస్తున్నట్లు శుక్రవారం ఖతార్ న్యాయస్థానం తెలిపిందని శిక్షలకు గురవుతున్న వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎటువంటి అధికారిక నిర్థారణ జరగలేదు.
అప్పీల్ విచారణకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసినందున ఈ నేవీలపై శిక్షల అమలు విచారణ ప్రక్రియ ముగిసే వరకూ ఆగేందుకు వీలుంటుంది. ఎనమండుగురు మాజీ నేవీలు ఇజ్రాయెల్ తరఫున దహారా గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ తరఫున పనిచేస్తున్నట్లు అభియోగాలు ఉన్నాయి. వీరిని గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. తరువాత వీరికి మరణశిక్షలు విధిస్తూ తీర్పు వెలువడింది.