Monday, January 20, 2025

ఊహించని ఊరట

- Advertisement -
- Advertisement -

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక విషాద ఘటన నుంచి కొంత ఊరట. పరాయి గడ్డ మీద భారతీయులకు కలిగిన కష్టం నుంచి పాక్షిక విమోచన. అరుదైన ఆపద నుంచి బయటపడుతున్న సంకేతాలు. గల్ఫ్ దేశం ఖతార్‌లో ఎనిమిది మంది మాజీ భారతీయ నౌకాధికారులకు పడిన మరణ శిక్షను పైకోర్టు కొట్టివేసిందన్న వార్త అమిత హర్షదాయకమైనది. ఇది భారతీయులందరూ స్వాగతించదగిన పరిణామం. అయితే ఇవి తొలి వార్తలే. స్పష్టత ఇంకా కొరవడే ఉంది. మరణ శిక్షల రద్దు వారికి పూర్తి విముక్తిని ప్రసాదిస్తున్నదా లేక ఆ శిక్షలను యావజ్జీవ శిక్షలుగానో నిర్ణీత వ్యవధి శిక్షలుగానో మార్చారా అనేది తెలియవలసి ఉంది. విద్రోహ ఆరోపణ నుంచి బయటపడ్డారో లేదో వెల్లడి కావలసి ఉంది. ఒక సమాచారం మరణ శిక్ష నుంచి విముక్తి లభించిందని చెబుతున్నది. మరో సమాచారం మరణ శిక్షను కొన్ని సంవత్సరాల శిక్షగా మార్చారని చెబుతున్నది. అంతేకాదు తగ్గించిన శిక్షను ఇండియాలో అనుభవించేలా ఏర్పాటు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

భారత ఖతార్‌ల మధ్య ఖైదీల మార్పిడికి 2015 లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇలా జరగవచ్చునని భావిస్తున్నారు. మొత్తానికి ఒక గండం గడిచింది. దోహాలోని అప్పీళ్ళ కోర్టు ఈ తీర్పును ఇచ్చినప్పుడు భారత రాయబారి విపుల్, శిక్షపడిన మాజీ అధికారుల కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నట్టు సమాచారం. శిక్ష తగ్గినందుకు సంతోషిస్తున్న కుటుంబ సభ్యులు వారిపై గల తీవ్రమైన ఆరోపణ నుంచి విముక్తిని కోరుతున్నారు. వారు నిర్దోషులుగా నిరూపణ అయి ఇళ్లకు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. ఈ ఎనిమిది మంది ఖతార్ కోసం జలాంతర్గామిని నిర్మిస్తున్న దాహ్ర గ్లోబల్ డిఫెన్స్ సర్వీసెస్ కంపెనీ అనే ఒక ప్రైవేట్ సంస్థలో పనికి చేరారు. ఆ జలాంతర్గామి నిర్మాణ రహస్యాలను ఇరాన్‌కు చేరవేస్తున్నారనే విద్రోహ ఆరోపణ మీద గత ఏడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేశారు. గత అక్టోబర్ 26 న కింది కోర్టు మరణ శిక్షలు విధించింది.

ఈ దారుణమైన ఆరోపణను ఉద్దేశపూర్వకంగా రుద్దారా అనే అనుమానం సహజం. దాని మూలాలు తెలియవలసి ఉంది. శిక్షలు పడినవారి అభిప్రాయాలు బయట పడలేదు. కోర్టులో వారి తరపున వినిపించిన వాదనల బలంతో శిక్షలు తగ్గాయా లేక దౌత్యయత్నాలు ఫలించడం వల్ల జరిగిందా అనేది కీలక ప్రశ్న. దుబాయ్‌లో ఈ నెల 1 జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఖతార్ అధినేత షేక్ తమిమ్‌ను కలుసుకొన్నారు. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల క్షేమాన్ని గురించి ఆయనతో ప్రస్తావించానని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం పోస్టింగ్‌లో పేర్కొన్నారు. ఇటు న్యాయస్థానంలో తగిన మద్దతు ఇస్తూనే ఈ అధికారుల విడుదల కోసం ఖతార్ అధికారులతోనూ సంప్రదిస్తూ వచ్చామని మన విదేశాంగ శాఖ తెలియజేసింది. మొత్తానికి కృషి ఫలించింది. శిక్షలు పడిన వారు మామూలు వారు కాదు. మన దేశ రక్షణ రంగంలో గణనీయమైన శిఖరాలు అందిన వారు.

దేశభక్తి లోతులు తెలిసినవారు. భారత నౌకా దళంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. యుద్ధ నౌకలకు నాయకత్వం వహించారు. వీరంతా ఇంత తీవ్ర విద్రోహానికి పాల్పడ్డారంటే నమ్మ బుద్ధి కాదు. పగతో ఎవరైనా వారిని ఇందులో ఇరికించారా అనేది కూడా తెలియవలసి ఉంది. ఇటువంటి ఉదంతాలు వ్యక్తిగత స్థాయిలో ఆగిపోవు దేశాల మధ్య అపోహలు, ఆపనమ్మకాలకు దారి తీసే ప్రమాదముంది. అనతికాలంలోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావడం అత్యంత సంతృప్తికరమైన పరిణామం. గతంలో ఎన్నడూ ఎదురు కాని ఇరకాటమైన పరిస్థితిని ఈ కేసు ఇండియాకు సృష్టించింది. స్వయంగా భారత ప్రధాని కల్పించుకోవలసి వచ్చింది. ఎప్పుడూ లేని రీతిలో ఇజ్రాయెల్‌తో ఇండియా సన్నిహిత సంబంధాలను పెనవేసుకుంటున్నది. పాలస్తీనా పట్ల ఆది నుంచి అనుసరిస్తున్న వైఖరిని దాదాపు వదిలిపెట్టి మళ్ళీ సవరణలు చేసుకొంటున్నది.

అది గల్ఫ్ దేశాలతో మన మైత్రిపై వ్యతిరేక ప్రభావం చూపి ఇటువంటి చిక్కులను దాపురింపజేసే అవకాశాలు లేకపోలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో వుంచుకొని ఈ దశలో ఎక్కువగా మట్లాడదలచుకోలే దని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించిందంటే దీని లోతులు భవిష్యత్తులో బయటపడతాయని అనుకోవాలి. తలెత్తిన చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించి ఈ ఉదంతం కలిగించిన సందేహాలు నివృత్తి కాగలవని ఎదురు చూద్దాం. విదేశాంగ విధానం చాలా సున్నితమైనది. పాలకులకు దేశీయంగా వుండే పక్షపాతాలు, వ్యతిరేకతలు అందులో ప్రతిబింబించకుండా చూసుకోడమే విజ్ఞత అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News