Sunday, January 19, 2025

విశిష్ట దౌత్య విజయం

- Advertisement -
- Advertisement -

కలా, నిజమా అనిపించిన వార్త సోమవారం నాడు దోహా (ఖతార్) నుంచి దూసుకు వచ్చి భారతీయులందరినీ ఆనందపరవశులను చేసింది. అక్కడి జైల్లో 16 మాసాలుగా మరణ దండన కత్తి కింద గుండెలు అరచేత పెట్టుకొని గడిపిన ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించిందన్న ఈ వార్త నిజంగానే సంతోష సముద్రంలో ముంచి తేలించింది. ఎనిమిది మందిలో ఏడుగురిని విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. మిగిలిన ఆ ఒక్క వ్యక్తికి సంబంధించిన న్యాయ పత్రాలు పూర్తి కావలసి వుందని, అవి జరిగిన తర్వాత ఆయనకు కూడా పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని దోహా అధికారులు చెప్పారు. ఇంత మందికి ఒకేసారి ఉరి శిక్ష పడడం, అంతలోనే ఏ శిక్షా లేకుండా వారు విడుదల కావడం ఆశ్చర్యకరమే. ఖతార్‌కు జలాంతర్గాములను నిర్మించి ఇస్తున్న ఒక ప్రైవేటు కంపెనీలో ఈ ఎనిమిది మంది అధికారులు పని చేసేవారు. వారిని ఏ నేరం కింద ఖతార్ అరెస్టు చేసిందో, ఏ కారణాల వల్ల మరణ దండన, మామూలు శిక్షలు రద్దు చేసి పూర్తిగా విడుదల చేసిందో అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.

అయితే ఇజ్రాయెల్‌కు రక్షణ రహస్యాలను అందజేస్తూ దాని ఏజెంట్లుగా పని చేశారన్న ఆరోపణే వీరికి మరణ శిక్ష పడేలా చేసిందని అనుకొంటున్నారు. దోహాలోని భారత విదేశాంగ శాఖ అధికారులు చక్కగా పని చేసి కేసు తీవ్రత తగ్గడానికి దోహదం చేశారన్నది కూడా వుంది. అయితే రాజకీయ స్థాయిలో గట్టి యత్నమేదో జరిగి వుండకపోతే ఇది ఇలా తేలిపోయి వుండేది కాదన్న అభిప్రాయం అవాస్తవం కాదు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపడం వల్ల ఈ అధికారులకు కఠిన శిక్షలు పడి వుంటాయని భావించేవారున్నారు. ఈ ఎనిమిది మందిని గత ఏడాది ఆగస్టు 30న అరెస్టు చేసి మరణ శిక్ష విధించారు. ఆ తర్వాత దానిని కొన్ని సంవత్సరాల పాటు అనుభవించే శిక్షగా మార్చారు. చివరికి ఇలా సుఖాంతమైంది. ప్రధాని మోడీకి, అమెరికా పాలకులకు మధ్య గల సత్సంబంధాలు కూడా వీరి విడుదలకు దోహదం చేసి వుండొచ్చు. ఖతార్ అంతర్జాతీయ సంబంధాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న సంగతి తెలిసిందే. హమాస్ శక్తులకు ఆశ్రయం ఇస్తున్నదని కూడా తెలిసింది. గాజాలో కొద్ది రోజుల పాటు దాడుల విరామాన్ని సాధించడంలో ఈజిప్టుతో కలిసి ఖతార్ కూడా అమెరికాకు తోడ్పడ్డాయి.

ఈ మొత్తం వ్యవహారంలో ఖతార్‌తో మనకున్న సత్సంబంధాలు చెదిరిపోకుండా కొనసాగుతూ వుండడం మంచి పరిణామం. మనకు ఇంధనం సరఫరా చేస్తున్న దేశాల్లో ఖతార్ అతి ముఖ్యమైనది. ఇటీవలే రెండు దేశాలూ 78 బిలియన్ డాలర్ల ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్) ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. 27 లక్షల జనాభా కలిగిన ఖతార్‌లో 8 లక్షల మంది భారతీయులున్నారు. అంటే అక్కడి చమురు తదితర పరిశ్రమల్లో మన వారు గణనీయమైన శక్తి అనవచ్చు. 6000 భారతీయ కంపెనీలు అక్కడ పని చేస్తున్నాయి. 202122 లో ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్ డాలర్ల పైమాటే. మన ఎల్‌ఎన్‌జి అవసరాల్లో 40% అక్కడి నుంచే దిగుమతి చేసుకొంటున్నాము. అలాగే ఖతార్ జైళ్లల్లో 3000 మంది భారతీయ ఖైదీలు వున్నారు. ఆర్థికంగా పటిష్టమైన సంబంధాలున్న ఈ రెండు దేశాల స్నేహం మరింత వర్ధిల్లుతుంది.

బిజెపి నాయకత్వంలోని భారత ప్రభుత్వాలు హిందూత్వ చిందులు మితిమించి వేస్తే అరబ్ దేశాలతో సంబంధాలు దెబ్బ తినే ప్రమాదమున్నది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనీయుల దాడులు సంభవించిన తర్వాత క్షణం ఆలస్యం చేయకుండా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్న ప్రధాని మోడీ విధానం భారత దేశాన్ని ఇరకాటంలో పెట్టింది. గాజాపై హద్దూ ఆపూ లేకుండా సాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో పాతిక వేల మందికి పైగా పాలస్తీనీయులు దుర్మరణం పాలవడం, వారిలో మహిళలు, పసి బిడ్డలు అధిక సంఖ్యలో వుండడంతో భారత్ కూడా ఆ దాడులు ఆపాలని కోరుకొన్నది. ఇజ్రాయెల్‌కు, అరబ్ దేశాలకు మధ్య ఆరని మంటగా పశ్చిమాసియా కొనసాగుతున్నది. ఇందుకు అమెరికా ఆజ్యం పోస్తున్నది. ఈ నేపథ్యంలో భారత దేశం అతి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకొన్నా దేశ ప్రజల సౌభాగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News