Thursday, January 23, 2025

పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ‘పరివర్తన్ భారత్’తో దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు ఇస్తున్న పిలుపుకు దేశ సైనికులు సైతం చేయి కలిపేందుకు ముందుకు వచ్చారు. దేశాన్ని కాపాడేందుకు ఇన్నాళ్లు దేశ సరిహద్దుల్లో పనిచేసిన మాజీ జవాన్లు ఆదివారం బిఆర్‌ఎస్ వేదికగా కిసాన్‌తో జతకట్టారు. జై జవాన్, జై కిసాన్ నినాదానికి సంపూర్ణ అర్థాన్నిచ్చే దిశగా ఐక్యత చాటారు. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీలో మహారాష్ట్రకు చెందిన మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాలి…
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ పిలుపునందుకొని రైతు రాజ్య స్థాపన కోసం దేశ జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని, ఇది దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు సూచన అని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సైనికాధికారులకు సిఎం స్వాగతం పలికారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించిన సిఎం కెసిఆర్, మహారాష్ట్రలో వీటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహ దం చేసే దిశగా మరోసారి వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ సైనికులకు కెసిఆర్ పిలుపునిచ్చారు.
‘ఫౌజీ జనతా పార్టీ’ కార్యదర్శి చేరికతో ప్రాధాన్యత
ఈ మేరకు నాసిక్ జిల్లాకు చెందిన ‘ఫౌజీ జనతా పార్టీ’ కార్యదర్శి, ప్రజాదరణ కలిగిన మాజీ సైనికుడు సునిల్ బాపురావు పగారె బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో పాటు సైన్యంలో పలు ర్యాంకుల్లో పనిచేసిన మాజీ సైనికాధికారులు, మాజీ కల్నల్‌లు, మాజీ లెఫ్టినెంట్‌లు, పలువురు మాజీ సైనికులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరిలో మాలెగావ్ నుంచి ప్రవీణ్ ఆనద్ థోకే, నాసిక్ నుంచి సాగర్ మాగ్రే, పూణే నుంచి తుకారాం దఫద్, సోలాపూర్ నుంచి సునిల్ ఆంధారె, శిరూర్ నుంచి బబన్ పవార్, డోండ్ నుంచి సందీప్ లగడ్, బీడ్ నుంచి రాజేంద్ర కప్రే, దరాశివ్ నుంచి హరిదాస్ షిండే, సంగ్లీ నుంచి శివాజీ నాయక్, జల్నానుంచి దినకర్ ధోడే, వాషిమ్ నుంచి అముల్ మపరి, సూరజ్ నామ్ దేవ్ రౌత్, అజింకియా రౌత్, నంద కుమార్ కడ్సే, అకోలా నుంచి మహేశ్ చౌహాన్, అహ్మద్ నగర్ నుంచి ఉమేశ్ హండే, హడప్సర్ నుంచి నారాయణ్ తోపే, నాగ్నాథ్ గోర్పడే, సంగ్లీ నుంచి రమేశ్ సాహెబ్, దోండ్ నుంచి జైనక్ సాహెబ్ తదితర మాజీ సైనికులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, బిఆర్‌ఎస్ నాయకులు శంకరన్న దోంగ్డే, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులున్నారు.

KCR2

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News