ఇంద్రవెల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు మండల ఎంపిపి పోటే శోభాబాయి అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ… పల్లెల ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే పట్టుకొమ్మలని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలు పొందాలని కోరారు.
మన ఊరు మన బడి కార్యక్రమం కింద మొదటి విడితలో ఎంపిక కాబడిన పాఠశాలలను అదనంగా ఆకర్షణీయంగా తీర్చి దిద్దడమే కాకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మందుకు రావాలని కోరారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కరాడే మారుతి, నారాయణ, శ్రీకాంత్, రాంకుమార్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పోటే సాయినాథ్, ఎస్‌బీ పోలీసు కడప రామరావు తదితరులు పాల్గొన్నారు.