అనంతగిరిలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి,
కేంద్రీయ ఔషధ గిడ్డంగి నిర్మాణానికి శంకుస్థాపన
జిల్లా మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్: వికారాబాద్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించి అనంతగిరిలో రూ. 7.50 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణ పనులకు, రూ. 3.6 కోట్లతో కేంద్రీయ ఔషధ గిడ్డంగి నిర్మాణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు 280 పడకల విస్తీర్ణపు నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అంతకుముందు మంత్రులు అనంతగిరి గుట్టలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల శాసనసభ్యులు మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కాలె యాదయ్యలతో పాటు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వైద్య, విద్యా శాఖ సంచాలకులు రమేష్ రెడ్డి, బిసి కమిషన్ సభ్యులు శుభ్రత్ పటేల్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయకుమార్, ఎంపిపి చంద్రకళ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.