Tuesday, January 7, 2025

ప్రశ్నార్థకాలు

- Advertisement -
- Advertisement -

ఇంకా, మరణించలేదు కాబట్టి
బతికున్నట్లే లెక్క
ఆయుష్షు రజ్జువులు తెగిపోలేదు కనుక
భావోద్వేగ సమయాల్లో
నిమిషానికి ఏడువందల సార్లు
మామూలు సమయాల్లో డ్బ్భై రెండు సార్లు
గుండె కొట్టుకుంటుంది కాబట్టి
నీవింకా బతికున్నట్లే లెక్క
జనాభా లెక్కల జాబితాలో
నీ పేరు చేరుస్తారులే భయపడకు
అమ్మ ఉమ్మనీటి సంద్రంలో
చేపపిల్లలా ఈదేటప్పుడే నీ సంబరాలు
ప్రపంచం తీరానికి కొట్టుకు వచ్చాక
పెంజీకటి ఋతువులో దినదిన దుఃఖగండాలే కదా
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్లు
ఏం సాధించావు నీవు, ఈ భ్రమల లోకంలోకి
ఈ రంగురంగుల కాంక్షల
ఉన్మత్త ప్రపంచంలో అడుగు పెట్టి
కాసేపు ధగధగలాడే ఆశల నక్షత్రాల
ఆకాశం ఊహల్లో ఊగుతూ
కాసేపు ఆత్మ హత్యకు పురి గొలిపే
ఒంటరితనపు దిగులు క్షణాల కీకారణ్యంలో
దిక్కుతోచక తారట్లాడుతూ
ఏమో ఈ బ్రదుకెందుకో అర్ధం కాదు
తెల్లారితే చాలు
రూపాయిల మాయా మృగాన్ని వెంటాడుతూ
ఆకలిదప్పులెరుగని వేటగాళ్ళు
నిద్రనదిలో నిశ్చింతగాహాయిగా
విహరించలేని అమాయకులు ఆనందం పెన్నిధి కోసం తప్ప
అనవసర వస్తువుల కోసం తపించే అన్వేషకులు
ఉక్కు ఊచల పంజరాన్ని వదిలి
ఒక్కక్షణం కూడా రెక్కవాలని సీతాకోక చిలుక
ఏ ప్రశ్నకు సమాధానమివ్వని
భయంకర మౌనజీవనం
దిగులు మేఘచయము కమ్మిన దుర్దినాల్లో
ఉదయమెక్కడ నీ కలలకు రంగులద్దే
చిత్రకారుడెక్కడ …
మందరపు హైమవతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News