కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్(డబ్లుబిబిఎస్‌ఇ) నిర్వహిస్తున్న సెకండరీ పరీక్షకు చెందిన చరిత్ర ప్రశ్నాపత్రంలో పొందుపరిచిన ఒక వివాదాస్పదమైన ప్రశ్నపై బెంగాల్‌లో దుమారం రేగుతోంది. జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన ఒక ప్రశ్నకు మూడు చాయిసెస్‌లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని దానిపై వివరణాత్మకంగా వ్యాసం రాయాలంటూ విద్యార్థులను కోరడంపై వివాదం రాజుకుంది. దేశంలో జరిగిన కార్మికుల ఉద్యమంలో మహాత్మా గాంధీ పాలుపంచుకున్నారా అన్నది ప్రధాన ప్రశ్న. దీనికి మూడు మూడు చాయిసెస్ ఇవ్వడం జరిగింది. అవి&ఎ) మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ మిల్లు యజమానుల లాబీకే ప్రాతినిధ్యం వహించారు. బి) కార్మికులకు, పెట్టుబడిదారులకు మధ్య ఘర్షణ జరగకూడదనే మహహాత్మా గాంధీ కోరుకున్నారు. సి)కార్మికుల ఉద్యమం వల్ల శాంతి భద్రతల పరిస్థితి దెబ్బతింటుందని మహాత్మా గాంధీ ఆందోళన చెందారు.
ఈ ప్రశ్నపై చరాఇత్రకారులు, వివిధ ఉపాధ్యాయుల సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ ప్రశ్న వివాదాస్పదమేగాక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని వారు పేర్కొన్నారు. కార్మికుల ఉద్యమం నుంచి మహాత్మా గాంధీ దూరమైనట్లు సెకండరీ సిలబస్‌లో ఎక్కడా ప్రస్తావన లేదని, ఈ ప్రశ్నను రూపొందించిన వ్యక్తికి చరిత్ర తెలియకపోవడమో లేక ఉద్దేశపూర్వకంగానే అలాంటి ప్రశ్న రూపొందించడమో జరిగిందని ఆల్ బెంగాల్ టీచర్లస్ అసోసియేషన్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.
కాగా..మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన విజయవంతమైన ఉద్యమాలలో 2018లో జరిగిన అహ్మదాబాద్ సత్యాగ్రహమని ప్రముఖ చరిత్రకారుడు ఎకె దాస్ తెలిపారు. ఇది మౌలికంగా అహ్మదాబాద్‌లోని జౌళి మిల్లు కార్మికుల ఉద్యమమని ఆయన తెలిపారు. మిల్లు కార్మికులకు మద్దతుగా మహాత్ముడు నిరాహార దీక్ష సైతం చేపట్టారని, కార్మికులకు 35 శాతం వేతనాల పెంపు కోసం ఆయన పట్టుపట్టారని దాస్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చరిత్ర వక్రీకరణ జరిగినట్లు అర్థమవుతోందని స్రెకండరీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ప్రస్తావిస్తూ ఆయన స్పష్టం చేశారు.
ఇలా ఉండగా డబ్లుబిబిఎస్‌ఇ అధికారులు మాత్రం విద్యార్థుల తెలివితేటలను బేరీజు వేయడానికి ఇటువంటి ప్రశ్నలు వేయడం సర్వసాధారణమంటూ తేల్చివేశారు. ఏదేమైనా ప్రశ్నాపత్రాన్ని దిద్దేటప్పుడు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటామని, ఎట్టి పరిస్థితులలో విద్యార్థులు నష్టపోకుండా చేస్తామని వారు చెప్పారు.