Thursday, January 23, 2025

ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడటం అత్యంత దారుణం

- Advertisement -
- Advertisement -

నిజానిజాలు నిగ్గు తేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలి
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పొరేట్ విద్యాసంస్థలు తమ స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి నీతిమాలిన చర్యలకు పాల్పడటం అత్యంత దారుణమని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి నిజానిజాలు నిగ్గు తేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఏపీ సిఐడి అధికారులు నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ అధినేత నారాయణ మరియు వారి సిబ్బందిలో కొందరిని ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులను చేస్తూ నేడు అరెస్టు చేయడం ఎంత మాత్రము ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యాసంస్థలు వారి సంస్థల ఉన్నతి కొరకు పాల్పడుతున్న అసాంఘిక చర్యలు, అవలంబిస్తున్న అడ్డగోలు పద్ధతులపై, మార్కుల మాయాజాలం, ర్యాంకుల కోసం చేసే అక్రమాల గురించి గతంలోనే ఉద్యమ స్థాయిలో ట్రస్మా ఆందోళన చేపట్టిందని గుర్తు చేశారు. అడ్మిషన్ల కోసం కల్లబొల్లి కబుర్లు చెబుతూ, అంకెల గారడీ చేస్తూ, మాయమాటలతో తల్లిదండ్రులను మభ్య పెడుతూ అత్యంత దారుణంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక, బడ్జెట్ పాఠశాలలు,కళాశాలలు విద్యార్థులు ఉన్నతికై వారు శ్రమిస్తున్న తీరు,అవలంబిస్తున్న విధానాలను తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు ఇప్పటికైనా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సరైన విధానంలో విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను నిర్వర్తిస్తున్న స్థానిక బడ్జెట్ పాఠశాలలను విశ్వసించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News