కొవిడ్ ఉధృతి ఉన్న రాష్ట్రాల్లో..
వారణాసి/భోపాల్: దేశంలో కరోనా ఉధృతి ఉన్న రాష్ట్రాల్లో మరణాలు పెరగడంతో పలు పట్టణాల్లో శ్మశాన వాటికల వద్ద శవాల దహనానికి క్యూ పద్ధతిని పాటించాల్సివస్తోంది. శుక్రవారం వారణాసిలో తమ బంధువు మృతదేహానికి అంతిమ సంస్కారాల కోసం శ్మశానవాటిక వద్ద ఐదు గంటలపాటు వేచి ఉన్నామని రవీంద్రగిరి అనే స్థానికుడు తెలిపారు. శవ దహనానికి మంచి కట్టెలు కూడా దొరకలేదని, పుచ్చిపోయిన కట్టెలతోనే తగులబెట్టామని ఆయన తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఇటీవల కొవిడ్ వల్ల మరణాలు పెరిగాయి. దాంతో, అక్కడి హరిశ్చంద్రఘాట్‌ను కొవిడ్ వల్ల మరణించినవారి కోసం కేటాయించారు. శ్మశానవాటికలో ఓవైపు 22 శవాలను దహనం చేస్తుండగా, మరోవైపు 1520 శవాలను క్యూలో ఉంచారని, ఇంకోవైపున విద్యుత్ వాటికలో 1015 శవాలను దహనం చేస్తున్నారని 48 ఏళ్ల మరో వ్యక్తి తెలిపారు. తన జీవితంలో ఇన్ని శవాలను అక్కడ ఏనాడూ చూడలేదని ఆయన తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోనూ ఇదే పరిస్థితి. నాలుగు రోజుల్లో అక్కడ 200 శవాలకు అంత్యక్రియలు నిర్వహించారని అధికారులు తెలిపారు. భోపాల్‌లో కొవిడ్ వల్ల మరణించినవారి సంఖ్య అధికారిక లెక్కలకన్నా అధికంగా ఉన్నదని స్థానిక బిజెపి నేత అజయ్‌బిష్నాయ్ తెలిపారు. ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇండోర్‌లో మృతుల బూడిదను తీసుకెళ్లడానికి బంధువులకు స్థానిక అధికారులు టోకెన్లిచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.