అప్పుడే పుట్టిన బిడ్డకు 108 సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఘటన మెదక్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన పాప ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. దీంతో ఎంసిహెచ్ డాక్టర్లు ఆ పసికందును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్‌కు పంపించారు. 108 వాహనంలో నిలోఫర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆ పసికందు గుండె ఆగిపోయింది.
దీంతో అంబులెన్స్ టెక్నీషియన్ రాజు వెంటనే పాపకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం పాపను చూసుకుంటూ ఆక్సిజన్ ఉంచి, హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అంబులెన్స్ టెక్నీషియన్ పాపకు చేసిన సిపిఆర్ విషయం వైద్యులకు తెలపగా నిలోఫర్ వైద్యులు, జిల్లా అధికారులు అభినందించారు. తనతో ఉన్న 108 సిబ్బంది కూడా ఈ విషయంలో తనకు సహకరించారని అంబులెన్స్ టెక్నీషియన్ తెలిపాడు.