Monday, December 23, 2024

సత్వర న్యాయం ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

సామాన్య జనానికి కూడా సత్వర న్యాయం అందేలా చూడాలని, ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసంగిస్తూ మరోసారి ఉద్ఘాటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర న్యాయం అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆలస్యమైన న్యాయాన్ని జరగని న్యాయంగానే పరిగణించాలన్నది అనుభవ సత్యం. ఇది న్యాయాన్ని హత్య చేస్తుంది. 2021 సెప్టెంబర్ నాటికి దేశంలోని అన్ని కోర్టుల్లోనూ గల పెండింగ్ కేసులు 4.5 కోట్లు, 2019 నాటికి వీటి సంఖ్య 3.3 కోట్లు. అంటే ఆ మధ్య కాలంలో పెండింగ్ కేసుల సంఖ్య నిమిషానికి 23 వంతున పెరిగింది. 2022 ఆగస్టు నాటికి సుప్రీం కోర్టులోని ముగింపుకి రాని కేసుల సంఖ్య 71,411. ఇందులో అపరిష్కృత సివిల్ కేసులు 56,365 కాగా, క్రిమినల్ కేసులు 15,076. ఇంతగా పెండింగ్ కేసులు మేటబడి ఉన్న దేశంలో సత్వర న్యాయం గురించి మాట్లాడే హక్కు పాలకులకు, విధాన కర్తలకు బొత్తిగా ఉండదు. న్యాయ జాప్యానికి అనేక కారణాలున్నాయి. దోషులు ఎంత మంది తప్పించుకొన్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే మానవీయ దృష్టితో మన న్యాయ వ్యవస్థ పని చేస్తుంది.

అందు కోసం అప్పీళ్ళ మీద అప్పీళ్లకు అవకాశం, వాయిదాల మీద వాయిదాలకు వీలు కల్పించారు. సింగల్ జడ్జి ధర్మాసనం నుంచి విస్తృత ధర్మాసనాలను కూడా ఆశ్రయించే పద్ధతిని ఏర్పాటు చేశారు. దీనిని ఉపయోగించుకొని చట్టానికి సులభంగా దొరక్కుండా జీవితాంతం తప్పించుకొనే లిటిగెంట్లు కూడా తయారయ్యారు. కేసుల జాప్యానికి ఇటువంటివి ఒక కారణం కాగా, ప్రభుత్వపరంగా తీసుకోవలసిన చర్యలు, కల్పించవలసిన సదుపాయాల్లో వల్లమాలిన జాప్యం, నిర్లక్ష్యం జరుగుతున్న సంగతిని ఎవరూ కాదనలేరు. విచారణలోని ఖైదీల సంఖ్యయే దేశంలో న్యాయ జాప్యానికి అసలైన నిదర్శనం. ప్రస్తుతం జైళ్లలోని ఖైదీలలో 77% మంది విచారణలోని ఖైదీలే. 2010లో వీరి సంఖ్య 2.14 లక్షలు కాగా, 2021 నాటికి 4.3 లక్షలకు చేరుకొన్నది. విచారణలోని ఖైదీల్లో దాదాపు సగం (49.7%) మంది యువకులే. (18-30 ఏళ్ల మధ్యలోనివారు 2023 నాటికి) విచారణలోని ఖైదీల్లో 66% మంది అణగారిన కులాలవారే. ఎస్‌టిలు (11.3%), ఎస్‌సిలు (21.3%), బిసిలు (31.5%). తగిన న్యాయ సాయం అందకపోడం వల్లనే వీరంతా జైళ్లలో మగ్గుతున్నారు.

తగినంత మంది జడ్జీలు లేకపోడం, మహిళా జడ్జీల కొరత అలాగే అవసరానికి తగ్గట్టు న్యాయమూర్తుల విచారణ మందిరాలు లేకపోడం, ఇంకా న్యాయస్థానాల్లో గ్రంథాలయాల కొరత వంటివి కూడా కేసులు పేరుకుపోడానికి దారి తీస్తున్నాయి. అవసరం మేరకు నిధులను ప్రభుత్వాలు కేటాయించకపోడం ఇందుకు ప్రధాన కారణం. ఒక కేసులో తీర్పు వెలువడడానికి సగటున 12 సంవత్సరాలు పడుతున్నట్టు అంచనా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, లోక్ అదాలత్‌లు, గ్రామ న్యాయాలయాల నిర్వహణ ఆశించినంతగా జరగడం లేదు. ఏమి జరగాలో ఉద్బోధించే పాలకులే ఎక్కువ. వాటిని జరిపించే దృష్టితో పని చేసేవారు తక్కువ. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంలో జరుగుతున్న జాప్యానికి కేంద్ర ప్రభుత్వమూ కారణమవుతున్నది. కొలీజియం సిఫారసులకు బూజుపట్టించడంలో తనకు సాటిలేరని ప్రధాని మోడీ ప్రభుత్వం నిరూపించుకొన్నది. వీరి నియామకాలపై గుత్తాధిపత్యాన్ని ఆశించి కొలీజియంను నిరుత్సాహ పరుస్తున్నది. దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 50 మంది జడ్జీలు అవసరం కాగా, వాస్తవంలో 21 మందే ఉండడం గమనించవలసి ఉంది.

అందుచేత సత్వర సులభతర న్యాయం ఆవశ్యకత గురించి దేశాధినేత నొక్కి చెప్పడంలో అర్ధం బొత్తిగా లేదు. న్యాయ స్థానాల్లో మౌలిక సదుపాయాల కొరత, ఖాళీలు సకాలంలో భర్తీ చేయకపోడమే కేసులు పెద్ద సంఖ్యలో అపరిష్కృతంగా మిగిలిపోడానికి ప్రధాన కారణాలని మాజీ సిజెఐ ఎన్‌వి రమణ గత ఏడాది జనవరిలో వెల్లూరులో ఒక సభలో మాట్లాడుతూ చెప్పారు. అందుబాటులోని నిధులను ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలు పెంచడానికి జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల అథారిటీని నెలకొల్పాలని తాను సూచించానని, అది ఆచరణకు నోచుకోలేదని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలు సమకూర్చవలసిన 40% నిధులను అవి కేటాయించలేకపోతున్నాయని, అందుచేత కేంద్రం ఇస్తున్న 60% నిధులు ఖర్చు కాకుండా మురిగిపోతున్నాయని ఆయన చెప్పారు. చాలా న్యాయ స్థానాల్లో వాష్ రూములు, గ్రంథాలయాలు, న్యాయమూర్తుల ఛాంబర్లు లేవని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వాల అడుగులు ముందుకు పడకపోడం క్షమించవలసిన విషయం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News