హైదరాబాద్ : జి- 20 యూనివర్శిటీ కనెక్ట్ లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి. గణేశ్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఇలాంటి పోటీల్లో పాల్గొనటం ద్వారా వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చని ప్రొఫసర్ గణేశ్ సూచించారు. మానసిక, వ్యక్తిత్వ వికాసం తో పాటు ప్రజ్ఞాపాటవాల్లోనూ రాణిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓయూ అనుబంధ కళాశాలల నుంచి దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు ఉత్సాహాన్ని చూపారు. ఈ పోటీల్లో విజేతలకు శుక్రవారం ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూరవిద్యా కేంద్రంలో జరిగే జీ 20 యూనివర్శిటీ కనెక్ట్ లో బహుమతులు ప్రదానం చేయనున్నారు.