ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, 1974, 1998లో అణ్వస్త్ర పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రాజగోపాల చిదంబరం శనివారం కన్నుమూసినట్లు అణు శక్తి సంస్థ (డిఎఇ) వెల్లడించింది. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. అణ్వస్త్ర కార్యక్రమంతో కూడా సంబంధం ఉన్న చిదంబరం ముంబయి జస్లోక్ ఆసుపత్రిలో మరణించారని డిఎఇ అధికారి ఒకరు తెలియజేశారు. చిదంబరం మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఆయన భారత అణుశక్తి కార్యక్రమం రూపశిల్పుల్లో ఒకరు, భారత వైజ్ఞానిక, వ్యూహాత్మక సామర్థాలు పటిష్ఠం చేయడంలో ఆయన విశేషంగా తోడ్పడ్డారు. ఆయనను మొత్తం దేశం కృతజ్ఞతతోస్మరించుకుంటుంటుంది. ఆయన కృషి భావి తరాలకు స్ఫూర్తిదాయకం’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. చిదంబరం కుటుంబానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన సంతాపం తెలియజేశారు. డిఎఇ కార్యదర్శి అజిత్ కుమార్ మొహంతి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
చిదంబరం తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో అనేక ప్రతిష్ఠాత్మక పదవులు నిర్వహించారు. ఆయన 200118 కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ వైజ్ఞానిక సలహాదారుగా, 199093 కాలంలో బిఎఆర్‌సి డైరెక్టర్‌గా, 19932000 కాలంలో అణు శక్తి కమిషన్ చైర్మన్‌గా, కేంద్ర ప్రభుత్వ డిఎఇ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన 19941995 కాలంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఎఇఎ) గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా కూడా సేవలు అందించారు. 1936లో జన్మించిన చిదంబరం చెన్నై ప్రెసిడెన్సీ కాలేజిలో, బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చదువుకున్నారు. చిదంబరం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ సహా ప్రతిష్ఠాకర పురస్కారాలు అందుకున్నారు. ఆయన పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు స్వీకరించారు. ఆయన ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ సైన్స్ అకాడమీల ఫెలోగా ఉన్నారు.