కేంద్రమంత్రి ప్రకటనపై మండిపాటు
బిసి సంఘాలు అత్యవసర సమావేశంలో ఆర్. కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : జనాభా గణనలో కులగణన చేయడం లేదని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్‌లో ప్రకటించడంపై 14 బిసి సంఘాలు మండిపడ్డాయి. గురువారం హైదరాబాద్‌లో అత్యవసర సమావేశాన్ని జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగింది. పార్లమెంట్‌లో వైసిపి ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు జవాబుగా కేంద్రమంత్రి బిసిలకు వ్యతిరేకంగా మాట్లాడాటాన్ని జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తప్పుబట్టారు. సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కుల గణనపై, బిసిలకు చట్ట సభలలో రిజర్వేషన్లపై రాజ్యాంగబద్ధమైన హక్కులపై చర్చ జరపాలని కోరారు. కుల గణన జరుపాలని ఎనిమిది రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేశాయి. 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. వీరు పార్లమెంట్ ను స్తంభింప చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. కులగణనతో ప్రతి కులం జనాభాతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ వివరాలు సేకరించి అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగే వీలుందన్నారు. పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభలలో బిసిలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బిసి సమస్యలపై ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పోరాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, కృష్ణ ముదిరాజ్, మట్ట జయంతిగౌడ్, కర్రి వేణుమాధవ్, శివ కుమార్, మంజుల, రమ, విజయలక్ష్మి, ఉదయ్ పాల్గొన్నారు.