మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు బిసి ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్‌లకు చోటు కల్పించారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆర్. కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, మరో బిసి నా యకుడు బీద మస్తాన్‌రావుల అభ్యర్థుల పేర్లను ఖరురు చేసినట్లు ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నాడు ప్రకటించారు.
ఆర్. కృష్ణయ్య కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ సిఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్‌ను ఆర్ కృష్ణయ్య కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి సంక్షే మం కోసం పాటు పడుతున్న తనను రాజ్యసభకు ఎంపిక చేసిన సిఎం జగన్ రాష్ట్రంలో బిసిలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బిసిల కోసమే తాను పోరాడుతున్నానని, బిసిల పోరాటం అనేది తెలంగాణకు మాత్రమే పరిమితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు.
నిరంజన్ రెడ్డికి నిర్మల్ వాసుల ప్రశంసలు ః
నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఎపి నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావడం పట్ల నిర్మల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ న్యాయవాదిగా ఖ్యాతి గడించిన నిరంజన్‌రెడ్డి అంచలంచెలుగా ఎంపి స్థాయికి ఎదగడం ఆనందదాయమని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. కాగా తనకు ఎంపి పదవి కల్పించిన ఎపి సిఎం జగన్‌కు నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.