ప్రధానికి జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు- ఆర్.కృష్ణయ్య లేఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో ఒబిసిల సంక్షేమానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం ఈ మేరకు ప్రధానికి లేఖను ఆయన రాశారు. లేఖలో బిసిల సమస్యలను కృష్ణయ్య ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడిచినా నేటికీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయలేదన్నారు. దేశ జనాభాలో బిసిలు 56 శాతం ఉన్నారని.. వారి విద్య, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి మార్గనిర్దేశం చేసేందుకు, పర్యవేక్షించడానికి ప్రత్యేక శాఖ లేకపోవడం బిసిల సమగ్ర అభివృద్ధిని నిర్లక్ష్యానికి గురిచేస్తుందన్నారు. కేంద్రంలో ఎస్‌సి (15 శాతం), ఎస్‌టి (7 శాతం)లకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయని.. జనాభాలో 56 శాతం ఉన్న వెనుకబడిన తరగతులు తమ సంక్షేమానికి ప్రత్యేక శాఖ లేదన్నారు. బిసిలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వానికి చిన్న విషయం.
ప్రస్తుతం కేంద్రంలోని సామాజిక న్యాయం, సాధికారత శాఖ నుంచి వేరు చేయడం ద్వారా దీనిని ఏర్పాటు చేయవచ్చునని తెలిపారు. గతంలో గిరిజన సంక్షేమ శాఖను ఇదే పద్ధతిలో విభజించారని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో75 కోట్ల మంది వెనుకబడిన తరగతుల ప్రజలు సమైక్య ప్రభుత్వంగా ఆత్మగౌరవంతో సంతృప్తి చెందుతారని వెల్లడించారు. కేంద్రం ఒబిసిలకు రిజర్వేషన్ కల్పిస్తోందని.. జాతీయ బిసి కమిషన్, జాతీయ బిసి కార్పొరేషన్లు, ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు 65 ఏళ్లుగా వెనుకబడిన తరగతుల శాఖలను ఏర్పాటు చేసి పథకాలను అమలు చేస్తోందన్నారు. అయినా నేటికి కేంద్ర ప్రభుత్వంలో అలాంటి ప్రత్యేక శాఖ లేకపోవడం శోచనీయమన్నారు. బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు దేశంలోని 75 కోట్ల మంది వెనుకబడిన తరగతుల జనాభా చిరకాల వాంఛ అని ఆయన తెలిపారు. బిసి సంక్షేమ సంఘం ఈ సమస్యను మీ దృష్టికి తీసుకువస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.