Saturday, December 21, 2024

పెరిగిన ధరల ప్రకారం విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెరిగిన ధరల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టల్స్, గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బిసి నేతల ప్రతినిధి బృందం బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌ల పెంపు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సత్యవతి రాథోడ్‌తో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారని తెలిపారు.

మంత్రివర్గ ఉప సంఘం వెంటనే సమావేశమై మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌ల పెంపుకు సిఫార్సు చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆయన పలు ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా పెరిగిన ధరల ప్రకారం కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ. 1500 నుంచి రూ.3 వేలకు పెంచాలని, పాఠశాల హాస్టల్, గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆహారపు చార్జీలు 8 నుండి 10వ తరగతి వారికి రూ.1100 నుంచి రూ.2500 కు, 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు రూ.950 నుంచి రూ. 2 వేలకు పెంచాలని కోరారు.

స్కాలర్ షిప్‌లను ఇంటర్, డిగ్రీ కోర్సులకు సంవత్సరానికి రూ.5,500, ఇంజనీరింగ్, పిజి, ఇతర విద్యా కోర్సులకు రూ.6,500 స్కాలర్‌షిప్ ఇస్తున్నారని వీరందరికీ ఒకే ష్లాబ్‌గా రూ.10 వేలకు పెంచాలన్నారు. పాఠశాల హాస్టల్ విద్యార్థులు, గురుకుల విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలను నెలకు రూ.400కు పెంచాలని బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మని రూ.500 మంజూరు చేయాలని, ప్రతి హాస్టల్‌కు మరో ముగ్గురు వర్కర్లను మంజూరు చేయాలని, ప్రతి హాస్టల్‌కు మ్యాగజైన్లు, వార్తా పత్రికలు మంజూరు చేయాలని, ప్రతి హాస్టల్‌కు 5 కంప్యూటర్లు, మంజూరు చేయాలని, కాలేజీ హాస్టళ్ళకు స్వంత భవనాలు నిర్మించాలని కోరారు. త్వరలో సమావేశం నిర్వహించి మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచుతామని మంత్రి హామినిచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News