Thursday, January 23, 2025

బిసిల బడ్జెట్ 20 వేల కోట్లకు పెంచాలి: కృష్ణయ్య డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసిల బడ్జెట్‌ను రూ.20 వేల కోట్లకు పెంచాలని జాతీయ బసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బిసి, ఈబిసి విద్యార్థులు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం శనివారం వేలాది మంది విద్యార్థులతో మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను ముట్టగించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం బిసి వ్యతిరేక వైఖరి మార్చుకొని బడ్జెట్‌ను పెంచాలని కోరారు.

వివిధ కాలేజీల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులకు బిసి విద్యార్థి సంఘం కన్వీనర్ వేముల రామకృష్ణ నాయకత్వం వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఐదు సంవత్సరాలలో రుణాలు ఇవ్వలేదని, బిసి గురుకులాలకు, హాస్టళ్ళకు ఏ ఒక్క భవనం కూడా కట్టలేదని ఆయనన్నారు. రాష్ట్రంలో 295 బిసి కాలేజీ హాస్టళ్ళకు, 321 బిసి గురుకుల పాఠశాలలకు ఒక దానికి కూడా సొంత భవనాలు లేవని, కేటాయించిన ప్రభుత్వ స్థలాలను కూడా ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు కట్టబెడ్తున్నారని ఆరోపించారు.

దొరల కోసం ఫ్లైఓవర్లు కట్టే ప్రభుత్వం రేపటి ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కావాల్సిన విద్యార్థులను అద్దె భవనాల దొడ్డిలో పశువులను తోలినట్లు ఒక్కో రూమ్‌లో 20 నుండి 50 మందిని ఉంచుతున్నారన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు రద్దు చేశారని విమర్శించారు. కాలేజీ కోర్సులు చదివే బిసి, ఈబిసి విద్యార్థుల పూర్తి ఫీజు చెల్లించాలని కోరారు. ఫిబ్రవరి 3న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో బిసిలకు కనీసం 20 వేల కోట్లు కేటాయించాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్సిడీ రుణాల కోసం బిసి కార్పొరేషన్‌కు రూ.4వేల కోట్లు, ఎంబిసి కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, 12 బిసి కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కెటాయించాలని కోరారు.

పెరిగిన ధరల ప్రకారం కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లను పెంచడానికి బడ్జెట్‌ను పెంచాలని కోరారు. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.2,500, పాఠశాల హాస్టళ్ళకు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆహారపు చార్జీలను పెంచాలని కోరారు. విదేశీ విద్యకు అర్హులందరికీ స్టైఫండ్ ఇవ్వడానికి బడ్జెట్‌ను రూ. 300 కోట్లకు పెంచాలని,బిసి అడ్వకేట్లకు ఇచ్చే స్టైఫండ్‌ను రూ.10 వేలకు పెంచాలని కోరారు. బిసి స్టడీ సర్కిల్‌కు రూ.200 కోట్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు, విద్యార్థి నేతలు రామకృష్ణ, గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, నీల వెంకటేష్, సి. రాజేందర్, అనంతయ్య, భూపేష్ సాగర్, రాజ్‌కుమార్, మోడి రామ్‌దేవ్, తిరుపతి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News