Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్‌కు ఆర్ కృష్ణయ్య లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిసి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో బిసి లకు జరుగుతున్న అన్యాయం పై దృష్టి సారించాలని, బిసి సమస్యలను నిస్పక్షపాతంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, బిసి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. బిసి సమస్యలపై ఉన్నత స్థాయి సమావేశం జరిపి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బిసి కార్పొరేషన్ ద్వారా గత 9 ఏళ్లుగా బిసి.లకు రుణాలు ఇవ్వడం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 2017 ఎన్నికల ముందు రుణాలు ఇస్తామని 5 లక్షల 77 వేల దరఖాస్తులు స్వీకరించి రుణాలు మాత్రం ఇవ్వలేదన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, – మైనారిటీ కార్పొరేషన్ ల ద్వారా రుణాలు ఇస్తూ బిసి కార్పొరేషన్ ద్వారా ఇవ్వకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు.

అనేక పోరాటాలు,- ఉద్యమాల తర్వాత 271 బిసి గురుకులాలు మంజూరు చేసినా ఒక్కదానికి కూడా సొంత భవనం నిర్మించలేదని కృష్ణయ్య అన్నారు. 295 బిసి కాలేజీ హాస్టల్స్ ఉన్నా ఒక్క సొంత భవనం నిర్మించడం లేదన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే బిసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని 35 వేలకు పరిమితం చేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ ్ట వర్గాలకు పూర్తి ఫీజులు ఇస్తూ బిసిలకు ఇవ్వకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గంలో బిసిల ప్రాతినిధ్యం తగిన విధంగా లేదని పేర్కొన్నారు. బిసి కమిషనర్ పోస్ట్ 2 సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదని, కమిషనర్ లేకుండా పాలన ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ దీర్ఘ కాలిక సెలవులపై వెళ్ళారని, కమిషనర్ సెక్రటరీ లేకుండా – డిపార్ట్మెంట్ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.

బిసి బందు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. 19 ప్రైవేట్ యూనివర్సిటీలు మంజూరు చేశారని అందులో ఎస్‌షి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు ఎత్తివేశారని అన్నారు. స్కాలర్ షిప్‌లు, మెస్ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించినా ఇంతవరకు ఆదేశాలు జారీ చేయలేదని తెలిపారు. బిసిలపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి బిసి సంఘాలు, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి లతో బిసి సమస్యలపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News