పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం ‘రైతన్న’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రైతు నాయకులు ఈ సినిమాను హైదరాబాద్‌లోని ప్రసాద్ క్యాబ్‌లో వీక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వడ్డె శోభనాద్రిశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోదండ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సిపిఎం నాయకులు మధు, టిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, గోరెటి వెంకన్న, కవి అందెశ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి , గోవర్ధన్, సాగర్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ “సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను. ఈ సినిమాలో ఎస్పీ బాల సుబ్రమణ్యం, వంగపండు ప్రసాద రావు పాటలు పాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ‘రైతన్న’ సినిమా తీశాను” అని అన్నారు. ప్రజాకవి గద్దర్ మాట్లాడుతూ “ఈ సినిమాలో రైతుల బాధల గురించి స్పష్టంగా చెప్పారు. కమిట్‌మెంట్ వున్న వ్యక్తి ఆర్.నారాయణ మూర్తి. వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ అని ఈ సినిమాలో చెప్పారు. ప్రధాని తెచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలు రద్దు చేయాలి”అని తెలిపారు.