సైబర్ క్రైం కొత్త భవనాన్ని ప్రారంభించిన
రాచకొండ సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, హైదరాబాద్ : యువత, మహిళలు ఎక్కువగా సైబర్ నేరస్థుల చేతిలో మోసపోతున్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. ఎల్‌బి నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైం ఎక్స్‌టెన్షన్ భవనాన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. సైబర్ నేరస్థులు విసిరిన వలలో పడి బాధితుడు డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని అన్నారు. మొబైళ్లకు వచ్చే నకిలీ లాటరీ మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. నకిలీ గిఫ్టులు, క్రిప్టో కరెన్సీ, పెట్టుబడులు స్కీంల పేరుతో మోసం చేస్తున్నారని వాటికి ఆకర్షితులు అయి మోసపోవద్దని అన్నారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన అపరిచితులను నమ్మి మోసపోవద్దని అన్నారు. యువకులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ యోధా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇందులో శిక్షణ తీసుకున్న యువకులు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సైబర్ యోధాలపై ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. సైబర్ వలంటీర్లుగా ఐటి నిపుణులు, స్కూల్, కాలేజీ విద్యార్థులు, ప్రజలను నియమిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎసిపి హరినాథ్, ఇన్స్‌స్పెక్టర్లు నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.