Wednesday, January 22, 2025

నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా.. సీసీ కెమెరాల ద్వారా నిఘా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అదనపు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. రాచకొండ పరిధిలో జరుగనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లపై రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ నేరెడ్‌మెట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ వినాయక చవితి నిమజ్జనం మూడు కమిషనరేట్ల పరిధిలో పెద్ద నిర్వహిస్తారని తెలిపారు.

నగర వ్యాప్తంగా గతఏడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారని అన్నారు. గణేష్ నిమజ్జనానికి అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, వినాయక చవితి ఉత్సవాల కోసం నెలరోజుల ముందు నుంచే పోలీసులను సిద్ధం చేశామని తెలిపారు. ఆర్ అండ్ బి, ఎలక్ట్రికల్ వర్క్ అన్ని పూర్తి చేశామని, విద్యుత్ కనెక్షన్స్ విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. గణేష్ మండప నిర్వహణ చేసే వారితో మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకున్నామని అన్నారు. గత సంవత్సరం రాచకొండ కమిషనర్ పరిధిలో 9,000 విగ్రహాలు ప్రతిష్టిస్తే ఈ సారి 11,000 పైచిలుకు విగ్రహాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు.

నిమజ్జనం ఏర్పాట్లు, రూట్ మ్యాప్ సిద్ధం చేయడం కోసం సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో వినాయక విగ్రహాలను ప్రతిష్టించడానికి ముందు నిర్వహకులతో ఇంటిమేషన్ ఫామ్ తీసుకున్నామని, ఇంటిమేషన్ ఫామ్ తీసుకోవడం వల్ల ఎన్ని విగ్రహాలు ప్రతిష్టించారు, ఎన్ని రోజులకు , ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారనే విషయంలో స్పష్టత వచ్చిందని తెలిపారు. లోకల్ గా ఉండే ఛాలెంజ్ లను దృష్టిలో ఉంచుకొని ఈసారి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని, అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామని, పెద్ద పెద్ద విగ్రహాలను, లిఫ్ట్ చేయడానికి ప్రత్యేకంగా మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. క్రేన్ ఆపరేటర్ విధిగా ఎనిమిది గంటలు డ్యూటీలో ఉండాలని ప్రణాళికను సిద్దం చేశామని, రెండు క్రేన్లకు కలిపి అదనంగా మరో క్రేన్ ఆపరేటర్‌ను నియమించామని తెలిపారు.

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నామని, 56 చెరువుల వద్ద ఇప్పటికే నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ప్రతి విగ్రహానికి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద విగ్రహాలకు ఒక కానిస్టేబుల్, హోంగార్డుతో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 228 పికెట్ ఏరియాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భక్తులకు సమస్యలు లేకుండా, నిమజ్జనం సమయంలో మొబైల్ టాయిలెట్స్, అంబులెన్స్‌లతో పాటు మెడికల్ టీంలు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ నుండి మెకానికులను , అదనంగా డ్రైవర్లను కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులు, దొంగతనాలను అరికట్టడానికి, మహిళా భద్రత కోసం రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్‌లతో డేగ కన్నుతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.

మద్యం సేవించి నిమజ్జనం కోసం రావద్దని ప్రజలను అభ్యర్థించారు. నిమజ్జనం సందర్భంగా నిఘా కోసం సుమారుగా 3,600 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామని, ఉప్పల్, నేరేడ్మెట్, ఎల్బీ నగర్‌లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం కోసం 6,000 మంది పోలీస్ సిబ్బందిని భద్రత విధుల్లో నియమించామని, మరో 1,000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా కమిషనరేట్ పరిధిలో కొన్ని ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలు వాహన దారులు గమనించాలని సూచించారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News