Wednesday, January 15, 2025

రాచకొండలో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

రెండు వేర్వేరు కేసుల్లో హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట పరిధిలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆదిభట్ల పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి 3.8 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఎల్‌బి నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, సైదాబాద్‌కు చెందిన వూట్లా రంజిత్ కుమార్ అలియాస్ నిఖిల్ అలియాస్ చోటు అలియాస్ లడ్డు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా, నెల్లికుదురు మండలం, చిన్నముప్పారం గ్రామానికి చెందిన బొల్లం సాయినితిన్ అలియాస్ సిద్దు విద్యార్థి, అచ్చంపేటకు చెందిన బాచు నరేంద్ర చదువుకుంటున్నాడు. ఎల్‌బి నగర్‌కు చెందిన బోయిన్‌పల్లి సాయికృష్ణ కలిసి హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారు.

ఎపికి చెందిన సాయి వీరికి హాష్ ఆయిల్‌ను సరఫరా చేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన నిందితులు హాష్ ఆయిల్‌ను విక్రయించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. రంజిత్ మిగతా వారు స్నేహితులు కావడంతో ఫిబ్రవరి24,2024లో అరకు వెళ్లి అక్కడ హాష్ ఆయిల్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితులు మళ్లీ ఎపిలోని అన్నవరం వెళ్లి హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి మీర్‌పేటకు తీసుకుని వచ్చి అవసరం ఉన్నవారికి విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, మీర్‌పేట పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్ రాష్ట్రం, సమస్తిపూర్, సారంగపూర్, తీస్‌వార సూర్యాపూర్‌కు చెందిన సంతోష్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

సంతోష్ కుమార్ కూలీ పనికోసం నగరానికి వచ్చి మహేశ్వరంలో ఉంటున్నాడు. బీహార్‌కు వెళ్లినప్పుడు అక్కడ గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ పనిచేస్తున్న కూలీలకు విక్రయిస్తున్నాడు. ఆగస్టులో బీహార్ రాష్ట్రానికి వెళ్లిన నిందితుడు 19ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి తీసుకుని వచ్చాడు. అవసరం ఉన్న వారికి రూ.30లకు ఒక చాక్లెట్‌ను విక్రయిస్తున్నాడు. ఈ విషయం మహేశ్వరం ఎస్‌ఓటి, ఆదిబట్ల పోలీసులకు తెలియడంతో దాడి చేసి అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News