బహిరంగంగా మద్యం తాగే వారికి రాచకొండ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. నెల రోజుల పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఓ ప్రకటనలో పేర్కొన్రాను. ఈ నిషేధం జనవరి 11 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారు మహిళలు, పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు.
మహిళలు, యువతులు, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినా, మానసికంగా వేధింపులకు గురిచేసినా జైలుకు పంపిస్తామని తెలిపారు. కొందరు బహిరంగ ప్రదేశాల్లో మందుతాగుతూ మహిళలు, యువతులు, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. మందుబాబుల ప్రవర్తన వల్ల వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందిని పేర్కొన్నారు. కొంతమంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి మహిళలు, పిల్లలతో సైకోల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, వారిని భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే నెల రోజుల పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.