క్రౌన్ అందుకున్న రేచల్ గుప్తా
70 దేశాల భామలను వెనుకకు నెట్టిన విజేత
బ్యాంకాక్‌లో జరిగిన ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ పోటీలు
ఈ విజయంతో ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డు కూడా రేచల్ సొంతం
న్యూఢిల్లీ : పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటం అందుకున్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరినీ వెనుకకు నెట్టి రేచల్ టైటిల్ సాధించారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరారు. ఈ విజయాన్ని రేచల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్లు రేచల్ తెలియజేశారు.
ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన అందరికీ రేచల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రేచల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు. రేచల్ 2022లో ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ద వరల్డ్’ టైటిల్ కూడా గెలుచుకున్నారు. ఇన్‌స్టాలో ఆమెకు 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన రేచల్ గుప్తా గ్లోబల్ అంబాసడర్‌గా ప్రపంచ శాంతి, స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు.