టీమిండియాపై ఆసీస్ అభిమానుల ప్రేలాపనలు
వరుసగా రెండో రోజూ భారత బౌలర్ సిరాజ్‌ను ఉద్దేశించి
టీమిండియాను క్షమాపణ కోరిన క్రికెట్ ఆస్ట్రేలియా
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియాపై ఆసీస్ అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ వేదికలో హర్భజన్, సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదాన్ని తాజా పరిణామాలు గుర్తుకు తెస్తున్నాయి. శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు బుమ్రా, సిరాజ్‌లపై స్టేడియంలోని ప్రేక్షకులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆదివారం నాలుగో రోజు ఆటలోనూ టీమిండియా ఆటగాళ్లకు అదే చేదు అనుభవం ఎదరైంది. రెండో సెషన్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కొందరు ‘బ్రౌన్ డాగ్, బిగ్ మంకీ’ అంటూ కామెంట్ చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు. సిరాజ్‌తో పాటు కెప్టెన్ రహానే ఫిర్యాదుతో కాసేపు చర్చించుకున్న అంపైర్లు ఆటను నిలిపివేసి పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించాడు. వెంటనే పోలీసులు వాళ్లను స్టేడియం నుంచి బయటికి పంపించారు. వారంతా మద్యం సేవించే భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీనిపై టీమిండియాకు క్రికెట్ ఆలియా(సిఎ) క్షమాపణలు తెలిపింది. దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కు బిసిసిఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇది జెంటిల్ మ్యాన్ గేమ్ అని, ఇక్కడ జాతి వివక్ష వ్యాఖ్యలకు చోటు లేదని బిసిసిఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
మరో రెండు వారాల్లో దీనిపై సిఎ విచారణ చేపట్టనుంది. ఇది పూర్తిగా ఆతిథ్యం దేశం బాధ్యత కాబట్టి సిఎనే విచారణ జరుపనుంది. మరోవైపు భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యల పట్ల ఐసిసి తీవ్రంగా స్పందించింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియాను వివరణ కోరింది. ఇలాంటి విషయాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. కాగా క్రికెటర్లపై ఇలా జాతి వివక్ష కామెంట్లు చేసే ప్రేక్షకులను స్టేడియానికి రాకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో పర్యటించే క్రికెట్ జట్లకు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలోనూ అనేక వివాదాలు వర్ణ వివక్ష వ్యాఖ్యల ఫలితంగానే జరిగాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ వేదికలో హర్భజన్, సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం ఎంత రచ్చగా మారిందో అందరికి తెలిసిందే.
ఇదేమీ కొత్త కాదు: అశ్విన్
సిడ్నీ మైదానంలో భారత ఆటగాళ్లకు జాతి వివక్ష వ్యాఖ్యలు కొత్తేమీ కాదని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. భారత ఆటగాళ్లను లక్షంగా చేసుకునే వారిపట్ల ఉక్కు పిడికిలి బిగించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. జాతి వివక్ష వ్యాఖ్యలు తమను నిరాశకు గురిచేశాయని చెప్పడం చాలా చిన్న మాట అవుతుందని, ఏది ఏమైనా తమ ఫిర్యాదు వెంటనే స్పందించి చర్యలకు దిగిన క్రికెట్ ఆస్ట్రేలియా చర్య కొంత ఊరట కలిగించిందని అశ్విన్ పేర్కొన్నాడు.
https://twitter.com/sarcastiqlonda/status/1348129750334590976?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1348129750334590976%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftimesofindia.indiatimes.com%2Fsports%2Fcricket%2Findia-in-australia%2F3rd-test-group-of-spectators-evicted-after-team-india-complains-about-abuse-from-crowd%2Farticleshow%2F80195319.cms
Racial Abuse on Team India Players in Sydney Test