Saturday, December 21, 2024

అమెరికా జాత్యహంకార సంస్థలు

- Advertisement -
- Advertisement -

మనుషులు పరస్పరం ద్వేషించుకోటానికి తగినంతగా మతం ఉంది. కానీ ప్రేమించుకోటానికి చాలినంతగా లేదు. ఆంగ్లో ఐరిష్ కవి, రచయిత జొనాథన్ స్విఫ్ట్. భారత్, అమెరికాలతో సహా నేటి ప్రపంచ పరిస్థితి ఇదే. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో శ్వేతసౌధానికి చాలా దగ్గరలో 06 జులై 2019 న మతవాద మూకలు ఊరేగింపుతో బహిరంగ సభ నిర్వహించాయి. మరోవైపు జాత్యహంకార వ్యతిరేక బృందాలు మతోన్మాదులను మించి భారీగా మోకరిల్లాయి. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు స్వల్ప ఘర్షణలు మినహా హింస జరక్కుండా నివారించారు. ప్రధాన సామాజిక మాధ్యమ సంస్థలు సంప్రదాయ వ్యతిరేక పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని మతమితవాదుల అభాండం. వీరి అనుబంధ సంస్థ ‘ప్రతిష్ఠాత్మక బాలురు’ (ప్రౌడ్ బాయ్స్) ‘ఫ్రీడం ప్లాజా’లో 200 మందితో ‘భావ ప్రకటన స్వేచ్ఛా వాంఛ’ పేరుతో ప్రదర్శన, సభ జరిపారు. ప్రౌడ్ బాయ్స్ తనను తాను పాశ్చాత్య భావానుకూల అహంకార సౌభ్రాతృత్వ బృందంగా అభివర్ణించుకుంది. అలబామా కేంద్రంగా పని చేస్తున్న ‘దక్షిణ పేద శాసన కేంద్రం’ దీన్ని ద్వేష బృందంగా వర్గీకరించింది.

డొనాల్డ్ ట్రంప్ ను సమర్థిస్తూ 2016లో అనేక మత మితవాద సంస్థలు స్థాపించబడ్డాయి. ఫాసిస్టు వ్యతిరేక కార్యకలాపాలను హింసా పద్ధతుల్లో ఎదిరించటమే ఈ సంస్థల లక్ష్యం. వాటిలో ప్రౌడ్ బాయ్స్ ఒకటి. ఉత్తర అమెరికా, కెనడాల ప్రధాన నగరాల్లోనే గాక ఇజ్రాయిల్ వంటి అమెరికా మిత్ర దేశాల్లో కూడా దీని శాఖలున్నాయి. ఇది కాలిఫోర్నియా, న్యూయార్క్ నుండి బర్కిలీ దాకా అనేక నగరాలలో ముస్లిం వ్యతిరేక, శ్వేత జాత్యహంకార, ఫాసిస్టు నిరోధ బృందాల వ్యతిరేక కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నది. దీని సమర్థన, ప్రచారాలకు అనేక తిరుగుబాటు మాధ్యమాలు తయారయ్యాయి. ఫ్రీడం ప్లాజాకు పక్కనే ఉన్న పెర్షింగ్ పార్క్ లో మతవాద వ్యతిరేక సంస్థ, ప్రగతిశీల బృందాల ఐక్య వేదిక ‘ఆల్ ఔట్ డిసి’ ఆధ్వర్యంలో మతోన్మాద నిరసన సభ నిర్వహించారు. జాతివాద, మతమౌఢ్య, ద్వేషభావాలను నిరోధించటమే ఈ నిరసనకారుల ఉద్దేశం. శ్వేతజాతి ఆధిపత్యాన్ని అనుమతించం. వాక్సాతంత్రమంటే ఇతరులను చంపటం కాదు అని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బిఎల్‌ఎం) నాయకుడు నీనీ టేలర్ వ్యాఖ్యానించారు. బిఎల్‌ఎం సామాజి మార్పు కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ, పర్యావరణ ఉద్యమాలు నడిపే అంతర్జాతీయ పోరాట వేదిక. నల్ల జాతి ప్రజలపై జరుగుతున్న జాత్యహంకార వ్యవస్థీకృత హింస, అణచివేత దాడులకు వ్యతిరేకంగా సంఘటితమైన ఆఫ్రికన్ -అమెరికన్ సమూహాల సమాహార ప్రచార సంస్థ. ఆల్ ఔట్ డిసి సభలో వలసదారులు, స్థానిక అమెరికన్లు, మధ్య లింగ వ్యక్తులు, మహిళలు, శ్వేత వర్ణేతరులు వంటి బహిష్కృత సమూహాలు పాల్గొన్నాయి. స్థానిక కళాకారులు, తమ కళారూపాల ప్రదర్శనతో వీరికి మద్దతు పలికారు.

మతవాదులు ‘వాక్ స్వాతంత్య్ర రక్షణ’ ముసుగులో మాటల యుద్ధం చేశారు. వాక్చాతుర్యంతో మతోన్మాద ఆయుధాలు తయారు చేసి బెదిరింపు ప్రచారం చేశారు. మతమౌఢ్య సమీకరణతో ప్రజల మద్దతు కూడగట్టారు. తమ తాత్విక భావాలను ప్రచారం చేయని మాధ్యమాలను విమర్శించారు. వామపక్షాలను ఎదిరించే వ్యూహాలను వివరించారు. వామపక్ష కార్యకర్తలను దూకుడుగా ఎదుర్కొనే పద్ధతులను వివరించారు. 2020 ఎన్నికల్లో ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ట్రంప్ భావజాల వ్యతిరేకులను అవమానించి అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు మన మిత్రులే. వాళ్ళు ఇక్కడున్నది మనకు మద్దతుగా మనలను కాపాడటానికే అని సమావేశ నిర్వాహకుడు డేవిడ్ సుమ్రాల్ సభలో పాల్గొన్న ప్రౌడ్ బాయ్స్ సభ్యులకు ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. సమావేశ ఉపన్యాసాలలో ప్రతి మాటా తూటాలను పేల్చింది. హింసను ప్రబోధించింది. వీరి మూఢ విశ్వాసాలను, మతమౌఢ్యాన్ని, మత వైరాన్ని అక్కడి సామాజిక మాధ్యమాలు తిరస్కరించటం మెచ్చుకోదగ్గ విషయం.

మతం సమాజాన్ని విభజించరాదు, కలపాలి. మానవత్వాన్ని పెంచాలి. అమెరికా మతవాద సంస్థలకు, భారత హైందవ మతసంస్థలకు చాలా సారూప్యతలున్నాయి. నేడు మన సమాజంలో స్తబ్ద నిశ్శబ్ద సంస్కృతి రాజ్యమేలుతోంది. రాజ్యం, మతం కలిసి పాలక సంఘ్ తాత్వికతను, హైందవ నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన వారిని హతమారుస్తున్నారు. హతులలో ప్రభుత్వాన్ని కూలదోయలేని మేధావులు, సంఘ సంస్కర్తలు, రచయితలు, చరిత్రకారులు, సామాజిక నిఘా కార్యకర్తలు ఉన్నారు. అధికార మతోన్మాదాన్ని ఎదిరించే శక్తులు బలహీనపడ్డాయి. మద్దతు పలికేవారు తక్కువైన నేపథ్యంలో దేశ ప్రగతికి పాటుపడిన అమీర్ ఖాన్‌లు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాల షారూఖ్ ఖాన్‌లూ మౌనమే మేలనుకున్నారు. ఆత్మీయులు హత్య చేయబడ్డ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రశ్నించి, విమర్శించి, పోరాటాన్ని కొనసాగించిన ప్రకాశ్ రాజ్‌లు అభినందనీయులే. భారత పోలీసులు అధికార పక్షాల కొమ్ముకాయటంలో ప్రతిపక్షాల నిరసనకారులపై లాటీలు ఆడించటంలో, తూటాలు పేల్చటంలో ఆరితేరారు. ఇరుపక్షాలకు నిష్పక్షపాత సమాన రక్షణ కల్పించటం మన రక్షక భటులు నేర్వని విద్య. మన కార్పొరేట్ల మాధ్యమాలు పాలక పక్షపాతాలు. ప్రజా వ్యతిరేకాలు.

ఎనిమిదేళ్ళ పాలనలో సంఘ్ సంస్థలు అన్ని విధాలా బలపడ్డాయి. మునుపే ప్రపంచ మంతా స్థాపించబడిన సంఘ్ పరివార సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. అవి ఉధృతంగా పని చేస్తున్నాయి. కొత్త తాత్విక సంస్థలను (థింక్ టాంకులను) భారీ సంఖ్యలో స్థాపించుకున్నాయి. పాత, కొత్త తాత్విక సంస్థలన్నీ సంఘ్ పాలన పునఃస్థాపితానికి, ఏకచ్ఛత్రాధిపత్య మోడీయ చక్రవర్తిత్వానికి విపరీతంగా కృషి చేశాయి. ముక్కలు చెక్కలయిన ప్రతిపక్ష, ప్రత్యామ్నాయ శక్తులు ఒక చోటికి చేరలేదు. ఒక తాటిపైకి రాలేదు. వాగాడంబరతలో, ద్వేషపూరిత ఉపన్యాసాల్లో, ముస్లిం, క్రైస్తవ, వామపక్ష వ్యతిరేక విష ప్రచారంలో చరిత్ర వక్రీకరణలో మన సంఘ్ సంస్థలకు అమెరికా మత మితవాద, జాత్యహంకార సంస్థలు దిగదుడుపే. మన అస్తిత్వ ఉద్యమాలు, కులమత సంస్థలు ప్రగతిశీల శక్తులకు తక్కువగా, పాలకులకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. భారత్ బహుళ సంస్కృతుల, భాషల, మతాల, దేవతల ప్రజాస్వామ్య సమాఖ్య, జమిలి ఎన్నికలు, జంట నాయకులు, ఏక (హైందవ) సంస్కృతి, ఏక (సంస్కృత) భాష, ఏక మతం, సీత లేని రౌద్ర రాముడు, ఏక పాలకుడు, అఖండ భారత్ నేటి మన మతోన్మాద పాలక నినాదాలు. సమర్థ, సమృద్ధ భ్రష్ట భవిష్య భారత ఎత్తుగడలు.

వివేక ప్రదర్శన చేయనివారు సంకుచిత దురభిమానులు. చేయలేనివారు మూర్ఖులు. చేయ సాహసించనివారు బానిసలు. లార్డ్ బైరాన్ గా పిలవబడే జార్జ్ గోర్దాన్ బైరాన్ విశ్లేషణ. ఈయన ఆంగ్ల కవి, సూక్ష్మగ్రాహి, రాజకీయవేత్త, గ్రీకు స్వాతంత్య్ర సమర విప్లవకారుడు. ఈ మూడు తరగతులకు చెందని మనుషులే మానవులు. మనం పట్టించుకోనంత మాత్రాన నాజీలు, ఫాసిస్టులు వెనుకంజ వేయరు. దుర్మార్గాలు చేయక మానరు. వీరి దుష్ట చేష్టలను ప్రతిరంగంలో, ప్రతి కోణంలో గట్టిగా ఎదుర్కోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News