Monday, December 23, 2024

ఇంటర్ విద్య ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఇంటర్ విద్యలో సమూల మార్పులు తేవాలని ఇంటర్మీడియేట్ బోర్డ్ నిర్ణయించింది. జాతీయ పరీక్షల సిలబస్‌ను ఇంటర్ సిలబస్‌లో మార్పులు తీసుకురావడంతోపాటు బో ధన ప్రణాళికను సమూలంగా మార్పు చేయాలని తీర్మానించారు. ఇందుకోసం సబ్జెక్టు నిపుణులతో కమిటీని నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వి ద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఇంటర్ బోర్డ్ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా, జెఎన్‌టియూహెచ్, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, ఇతర ఉన్నతాధికారు లు హాజరయ్యారు.

సమావేశంలో 111 అంశాలపై చర్చించారు. ప్రధానంగా ప్రైవేటు కాలేజీల అనుబంధ గుర్తింపు, కోర్సుల్లో తీసుకు రావాల్సిన మార్పులు, పాలనపరమైన అనుమతుల్లో జాప్యా న్ని నివారించడంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కొవిడ్ పరిణామాల నేపథ్యంలో ఇంటర్ విద్యలో చోటుచేసుకున్న మార్పులపై మం త్రి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ఏడా ది ఇంటర్ ఫలితాల మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

పాఠ్యాంశాల్లో మార్పులు

ఇంటర్మీడియేట్ గ్రూపుల్లో మారుతున్న పరిస్థితులను అనుగుణంగా మార్పులు తీసుకువచ్చే అంశంపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఇంటర్ కోర్సుల్లో సంబంధం లేని సబ్జెక్టులున్నాయని, వీటిని మార్చాల్సిన అవసరం ఉందని ఇంటర్ బోర్డ్ అధ్యయన నివేదికల్లో వెల్లడైన అంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతం ఎంపిసి, బైపిసి గ్రూపుల సిలబస్ నీట్, జెఇఇ పరీక్షలకు అనుగుణంగానే ఉందని, అలాగే ఆర్ట్ గ్రూపుల సిలబస్‌ను కూడా క్యాట్ వంటి జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా మార్పు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. ఇంటర్ ఎంఇసి, ఎంపిసి గ్రూపులకు ఒకే విధమైన గణిత సబ్జెక్టులున్నాయని, వాస్తవానికి గణిత విద్యార్థులతో సమానంగా ఎంఇసి విద్యార్థులకు గణితం సబ్జెక్టు ఉండాల్సిన అవసరం లేదని బోర్డ్ భావించారు.

ఎంఇసిలో మ్యాథ్స్ సబ్జెక్టును కామర్స్‌కు ఉపయోగపడే సబ్జెక్టులో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించారు.అలాగే సిఇసి గ్రూపులో సివిక్స్ కన్నా అకౌంటెన్సీకి ప్రాధాన్యం ఇవ్వాలని, హెచ్‌ఇసిలో సివిక్స్ స్థానంలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో లోతైన అవగాహన పెంచేలా మార్పు చేయాలని బోర్డ్ ప్రతిపాదించింది. ఇంటర్‌లో ఉండే తెలుగు, హిందీ ఇతర భాషా సబ్జెక్టుల్లో నైతిక విలువలు పెంపొందించే దిశగా మార్పులు తేలవాలని తీర్మానించారు. ఇంటర్ గ్రూపుల్లో సబ్జెక్టులు, సిలబస్ మార్పులపై సబ్జెక్టు నిపుణులతో కమిటీని నియమించాలని నిర్ణయించారు.

మే నెల లోగా కాలేజీలకు అఫిలియేషన్లు

రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఏటా మే నెల లోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రైవేటు కాలేజీలకు బోర్డ్ గుర్తింపు ప్రక్రియ కొన్నేళ్ళుగా విమర్శలకు గురవ్వడంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కాలేజీలు తెరిచి నెలలు గడుస్తున్నా అనుబంధ గుర్తింపు పెండింగ్‌లో పెట్టడం, ఆ తర్వాత అన్ని కాలేజీలకు గుర్తింపు ఇవ్వడం ఏటా సర్వసాధారణమైందని సమావేశంలో పలువురు ప్రస్తావించారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో గతంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న విమర్శలపైనా చర్చించారు.

వీటన్నింటికీ పరిష్కారంగా కాలేజీలు తెరిచే నాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని, మే నెలలోనే గుర్తింపు ఇచ్చేదే లేనిది స్పష్టంగా తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయో మెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని బోర్డ్ నిర్ణయించింది. వికలాంగ విద్యార్థులకు పరీక్ష రాసే అదనపు సమయాన్ని 30 నిమిషాల నుంచి 60 నిమిషాలకు పెంచాలని బోర్డ్ తీర్మానించింది. జవాబు పత్రాల మూల్యంకనం వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ విధానంలో చేపట్టాలని ప్రతిపాదించారు. అయితే తొలుత భాషా సబ్జెక్టులకు ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ మూల్యంకన అమలు చేసి, తర్వాత అన్ని సబ్జెక్టులకు అమలు చేయాలని నిర్ణయించారు.

ఇంగ్లీష్ నైపుణ్యాలు పెంపొందించేలా ప్రాక్టికల్స్

ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ప్రాక్టికల్స్ నిర్వహించాలని సమావేశంలో ప్రతిపాదించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు రాణించాలంటే నైపుణ్యం చాలా అవసరమని, అయితే విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడటంలో వెనుకబడి పోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని గుర్తించారు. ఇందుకోసం ఇంటర్‌లో ఇంగ్లీష్ సబ్జెక్టుకు 80 మార్కులు థీయరీకి, 20 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు.

జూన్ నాటికి పాఠ్య పుస్తకాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూనియర్ కాలేజీలు కాలేజీలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. బోర్డ్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. పేపర్ సకాలంలో అందని కారణంగా పాఠ్యపుస్తకాల ముద్రణ ఈ ఏడాది ఆలస్యమైందని,వచ్చే ఏడాదికి కావాల్సిన పాఠ్య పుస్తకాలకు టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News