Monday, December 23, 2024

ఫ్రెంచ్ ఓపెన్‌కు నాదల్ దూరం

- Advertisement -
- Advertisement -

ఫ్రెంచ్ ఓపెన్‌కు నాదల్ దూరం
2024 తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై
స్పెయిన్ బుల్ కీలక నిర్ణయం
మలోర్కా(స్పెయిన్): కెరీర్‌కు సంబంధించి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సంచలన ప్రకటన చేశాడు. 2024 సీజన్ తర్వాత ఆట నుంచి తప్పుకుంటానని నాదల్ పేర్కొన్నాడు. అంతేగాక గాయాలు వెంటాడుతుండడంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగడం లేదన్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో సాధించక పోవడంతో ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశాడు. గురువారం మలోర్కాలోని తన టెన్నిస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదల్ ఈ వివరాలను వెల్లడించాడు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ టెన్నిస్‌లో కొనసాగించాలని భావించినా గాయాలు ప్రతికూలంగా మారాయన్నాడు.

ఇలాంటి స్థితిలో 2024 సీజన్ తర్వాత ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించానన్నాడు. అన్ని ఆలోచించాకే నిర్ణయానికి వచ్చానన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాలని ఉన్నా గాయాలతో అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదన్నాడు. తన కెరీర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాలా ప్రత్యేకమైందన్నాడు. రొలాండ్ గారొస్‌లో ఇప్పటికే 14 టైటిల్స్ సాధించడం చాలా గర్వంగా ఉందన్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించానన్నాడు. జకోవిచ్, ఫెదరర్, ముర్రేతో సహా ఎంతో మంది దిగ్గజాలతో కలిసి టెన్నిస్ ఆడడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తానన్నాడు. ఇక చిరకాల ప్రత్యర్థులు జకోవిచ్, ఫెదరర్‌లంటే తనకు ఎంతో గౌరవమన్నాడు.

పోరాటానికి మరో పేరు వీరిద్దరన్నారు. వీరితో చాలా ఏళ్ల పాటు టైటిల్స్ కోసం పోరాడడం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తానని నాదల్ పేర్కొన్నాడు. ఇదిలావుంటే సుదీర్ఘ కెరీర్‌లో నాదల్ రికార్డు స్థాయిలో 22 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏడాది కాలంగా నాదల్‌ను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అతను ఈ సీజన్‌లో పలు టోర్నమెంట్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా తనకు ఎంతో ప్రత్యేకమైన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది నాదల్‌తో పాటు అతని అభిమానులను ఎంతో నిరాశకు గురి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News