Sunday, January 19, 2025

టెన్నిస్‌కు నాదల్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

స్పెయిన్ బుల్, టెన్నిస్ దిగ్గజం, మట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని నాదల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నవంబర్‌లో జరుగనున్న డేవిస్ కప్ ఫైనల్ తన చివరి టోర్నీ అని పేర్కొన్నాడు. 15 ఏళ్ల ప్రయంలోనే ప్రొఫెషనల్ టెన్నిస్‌లో ప్రవేశించిన నాదల్ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో నాదల్‌ది ప్రత్యేక చరిత్ర అనే చెప్పాలి. కెరీర్‌లో ఏకంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచి నయా చరిత్రను లిఖించాడు. నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఒక్కడే నాదల్ కంటే ఎక్కువ సంఖ్యంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు.

జకోవిచ్ కెరీర్‌లో ఇప్పటి వరకు 24 గ్రాండ్స్‌స్లామ్ ట్రోఫీలను సాధించాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కెరీర్‌లో నాదల్ రికార్డు స్థాయిలో 30 గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడాడు. ఫెదరర్ (31), జకోవిచ్ (37) మాత్రమే అతని కంటే ముందంజలో ఉన్నారు. ప్రపంచ టెన్నిస్‌లో నాదల్ అసాధారణ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో ఎన్నో చేదు, తీపి జ్ఞాపకాలను చవిచూశాడు. వ్యక్తిగత సమస్యలతో పాటు గాయాలు నాదల్‌ను వెంటాడాయి. అయినా వాటిని తట్టుకుంటూ రఫెల్ ప్రపంచ టెన్నిస్‌లో రారాజుగా వెలుగొందాడు.

క్లే కోర్టు కింగ్..
నాదల్ మట్టి కోర్టు (క్లే కోర్టు) కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో నాదల్ ఎదురులేని శక్తిగా కొనసాగాడు. నాదల్ ఏకంగా 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించి నయా చరిత్రను తన పేరిట లిఖింకున్నాడు. మరే ఆటగాడు కూడా ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఇన్ని టైటిల్స్ గెలుచుకోలేదు. దీంతో పాటు నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 116 మ్యాచ్‌లు ఏకంగా 112 పోటీల్లో విజయం సాధించాడు. కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే పరాజయం చవిచూశాడు. అంతేగాక ఫైనల్‌కు చేరిన ప్రతిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధించి నయా చరిత్ర సృష్టించాడు. పురుషుల టెన్నిస్‌లో నాదల్ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. సెర్బియా యోధుడు జకోవిచ్, స్విస్ దిగ్గజం ఫెదరర్ నుంచి నాదల్‌కు గట్టి పోటీ ఉండేది. పురుషుల టెన్నిస్‌లో పోటీ ఈ ముగ్గురి మధ్య ఉండేది.

ఒకవేళ గాయాలు వెంటాడక పోయి ఉంటే కెరీర్‌లో నాదల్ మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించే వాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంత కాలంగా నాదల్‌ను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. దీంతో అతను చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉండి పోక తప్పలేదు. తనకు ఎంతో కలిసివచ్చే ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా అతను బరిలోకి దిగలేక పోయాడు. మరి కొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగే సత్తా ఉన్నా కూడా గాయాలు వెంటాడుతుండడంతో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని నాదల్ నిర్ణయించాడు.

టెన్నిస్‌పై తనదైన ముద్ర..
ప్రపంచ టెన్నిస్‌పై నాదల్ తనదైన ముద్ర వేశాడు. టోర్నమెంట్ ఏదైనా వరుస టైటిల్స్ సాధించడం అలవాటుగా మార్చుకున్నాడు. 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో నాదల్ పలు టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇందులో రికార్డు స్థాయిలో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉండడం విశేషం. కెరీర్‌లో నాదల్ ఏకంగా1,080 మ్యాచుల్లో విజయం సాధించి 227 పోటీల్లో ఓటమి పాలయ్యాడు. చిరకాల ప్రత్యర్థులు రోజర్ ఫెదరర్‌పై 24, జకోవిచ్‌పై 29 మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేశాడు. 2010లో నాదల్ కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను సాధించాడు. 24 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించి నయా చరిత్రను లిఖించాడు. అంతేగాక రికార్డు స్థాయిలో 209 వారాల పాటు ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచాడు. జకోవిచ్ (428), ఫెదరర్ (310) మాత్రమే అతనికంటే ముందంజలో ఉన్నారు. తన కెరీర్‌లో నాదల్ 92 ఎటిపి సింగిల్స్ టైటిల్స్‌ను సాధించాడు.

అంతేగాక రికార్డు స్థాయిలో 912 వారాల పాటు టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో టాప్10లో నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. క్లే కోర్టులో వరుసగా 81 మ్యాచుల్లో గెలిచి నయా రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. దీంతో పాటు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కూడా సాధించాడు. ఇలా ఎన్నో చారిత్రక విజయాలను నాదల్ లిఖించాడు. ప్రపంచ టెన్నిస్‌కు లభించిన ఆణిముత్యాల్లో నాదల్‌ది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. కాగా, నాదల్ తన కెరీర్‌లో 14 ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు యూఎస్ ఓపెన్, రెండు వింబుల్డన్, మరో రెండు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. కెరీర్‌లో నాదల్ గోల్డెన్ గ్రాండ్‌స్లామ్‌ను సాధించాడు.నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంతో నాదల్‌కు ఇది దక్కింది. 2001లో నాదల్ అంతర్జాతీయ టెన్నిస్‌కు శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. కెరీర్ ముగిసే లోగా ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News