Monday, December 23, 2024

టెన్నిస్ రారాజు నాదల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం : పురుషుల టెన్నిస్‌లో తనకు ఎదురులేదని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. కెరీర్‌లో 14వ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించడం ద్వారా తనలో చేవ తగ్గలేదని చాటాడు. అసాధారణ పోరాట పటిమతో రొలాండ్ గారొస్ టైటిల్‌ను నాదల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ సాధించే క్రమంలో ఎన్నో మారథాన్ మ్యాచ్‌లను నాదల్ ఆడాడు. ఇక 22 టైటిల్స్‌తో పురుషుల గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు సాధించిన ఆటగాడిగా నాదల్ నిలిచాడు. నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో ఏకపక్ష విజయం సాధించిన నాదల్ తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మట్టి కోర్టు టోర్నీగా పేరుగాంచిన రొలాండ్ గారొస్‌లో నాదల్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. కెరీర్‌లో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించి ఈ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారిడిగా చరిత్ర సృష్టించాడు. అంతేగాక ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన అన్ని సార్లు టైటిల్స్ సాధించిన ఆటగాడు కూడా నాదల్ మాత్రమే. 19 ఏళ్ల వయసులో నాదల్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ టోర్నీలో మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అసాధారణ ఆటతో టైటిల్స్ మీద టైటిల్స్ సాధించి ఫ్రెంచ్ ఓపెన్‌పై తనదైన ముద్ర వేశాడు. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఇలా ఒక టోర్నమెంట్‌లో ఇన్ని టైటిల్స్ సాధించలేదు.
పట్టువదలని విక్రమార్కుడు..
పురుషుల టెన్నిస్‌లో నాదల్ ఓ అసాధారణ పోరాట యోధుడనే చెప్పాలి. గాయాలు, వ్యక్తిగత సమస్యలు బాధించినా వాటిని తట్టుకుంటూ ముందుకు సాగాడు. ఏ దశలోనూ ధైర్యాన్ని కోల్పోలేదు. క్లిష్ట సమయాల్లోనూ నిబ్బరంగా ఉంటూ లక్షం దిశగా అడుగులు వేశాడు. కొన్నేళ్ల క్రితం నాదల్‌ను గాయాలు ఎంతో బాధించాయి. గాయాలు ఎంతకీ తగ్గక పోవడంతో ఒక దశలో నాదల్ కెరీర్ ముగిసిందేనని అందరూ భావించారు. అయితే స్పెయిన్ బుల్ మాత్రం అధైర్య పడలేదు. సమస్యలకు ఎదురొడ్డి నిలిచాడు. ఒకవైపు గాయాలు మరోవైపు ప్రత్యర్థులు జకోవిచ్, ఫెదరర్ తదితరుల నుంచి గట్టి పోటీని తట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నాదల్‌కు ఏర్పడింది. వీటితో నాదల్ తనదైన శైలీతో పోరాడాడు. జకోవిచ్, ఫెదరర్‌లను సయితం వెనక్కినెట్టి గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన ఆటగాడిగా నాదల్ నిలిచాడు. మొక్కువొని ధైర్యం, ఆటపై ఉన్న అంకితభావం వల్లే నాదల్ ఈ స్థాయికి చేరాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రానున్న రోజుల్లో కూడా నాదల్ మరిన్ని టైటిల్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే పురుషుల టెన్నిస్‌లో నాదల్ రికార్డు ఎప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచిపోవడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News