Thursday, January 9, 2025

కల చెదిరిన నాదల్

- Advertisement -
- Advertisement -

Rafael Nadal Injury Revealed at Wimbledon 2022

 

క్రీడా విభాగం: సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికే 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించిన రఫెల్ నాదల్‌కు వింబుల్డన్ ఓపెన్‌లో అంతంత మాత్రం రికార్డే ఉంది. ఈ చాంపియన్‌షిప్‌లో నాదల్ రెండు సార్లు మాత్రమే టైటిల్స్ సాధించాడు. కానీ ఈ ఏడాది ఆరంభం నుంచే నాదల్ జోరుమీదున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈసారి వింబుల్డన్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఒకవైపు గాయం బాధిస్తున్నా ఒక్కొ మ్యాచ్‌లో గెలుస్తూ సెమీ ఫైనల్ వరకు దూసుకొచ్చాడు. అయితే గాయం తిరగబడడంతో సెమీస్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఒకవేళ నాదల్ వైదొలి ఉండకపోయి ఉంటే కచ్చితంగా టైటిల్ సాధించే వాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో నాదల్ పోరాట పటిమను ఎంత పొగిడినా తక్కువే. ఓటమి అంచుల వరకు వెళ్లి మ్యాచ్‌ను సొంతం చేసుకున్న తీరును ప్రశంసిచక ఉండలేం. గాయం బాధిస్తున్నా నాదల్ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రత్యర్థి ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నా నాదల్ మాత్రం తన మార్క్ పోరాట పటిమతో ధైర్యంగా నిలబడ్డాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ప్రత్యర్థి జోరును అడ్డుకున్నాడు. ఒకవేళ గాయం సమస్య ఉండకపోతే ఈ మ్యాచ్‌లో నాదల్ అలవోకగా విజయం సాధించి ఉండేవాడు. కానీ గాయం నొప్పితో బాధపడుతూనే మ్యాచ్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో ఐదు సెట్ల మారథాన్ సమరంలో ప్రత్యర్థిని మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.

వెంటాడిన దురదృష్టం..
అసాధారణ ఆటతో సెమీస్‌కు చేరినా నాదల్‌ను దురదృష్టం గాయం రూపంలో వెంటాడింది. గాయం తిరగబడడంతో అతను సెమీస్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకోవాలని భావించిన నాదల్ కల చెదిరి పోయింది. మరోవైపు అతని చిరకాల ప్రత్యర్థి జకోవిచ్‌కు ఇది వరంగా మారింది. నాదల్ వైదొలగడంతో జకోవిచ్ వింబుల్డన్ టైటిల్ సాధించే అవకాశాలు మెరుగయ్యాయి. ఈ టైటిల్ సాధిస్తే జకోవిచ్ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ చేరుతాయి. ఒక రకంగా ఇది నాదల్ రికార్డుకు ఇబ్బందికర అంశంగానే చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News