మన తెలంగాణ/హైదరాబాద్ : ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. పటిష్టమైన నియంత్రణ చర్యలపై యూనివర్సిటీలు, కాలేజీలు ప్రధానంగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు సరైన మొగ్గుచూపకపోవడంతో ర్యాగింగ్ రక్కసి వికటాట్టహాసం చేస్తోంది. పలువురు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీంతో మానసిక వేదనకు గురైన విద్యార్థులు ఇక తమకు చావే శరణ్యమని భావించి క్షణికావేశంలో చర్యలు తీసుకుని వారి తల్లిదండ్రులకు తీరని మనోవ్యధను మిగుల్చుతున్నారు. షరా మామూలుగా ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆయా యూని వర్సిటీలు, కాలేజీ యాజమాన్యాలు ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’లా తూతూ మంత్రంగా ర్యాగింగ్ నియంత్రణ కమిటీలు వేస్తున్నామంటూ హడావుడి చేస్తున్నాయి తప్పించి, అసలు ర్యాంగింగ్ మూలాలను నియంత్రించే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేనే లేవన్నది పలువురి వాదన.
విద్యతో భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవలసిన విద్యార్థులు మారుతున్న కాలంలో వికృత చేష్టలకు కేరాఫ్ చిరునామాగా మారుతున్నారు. కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులతో స్నేహాన్ని బలపరుచుకునే విధానాన్ని విస్మరించి, తోటి విద్యార్థి
మానసికంగా కృంగిపోయి చనిపోయే విధంగా హింసకు ప్రేరేపిస్తున్నారు. దీనికే ‘ర్యాగింగ్’ అనే పేరు పెట్టి మరీ తోటి విద్యార్థుల జీవితాలను చిదిమేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా ఈ ‘ర్యాగింగ్’ అనేది జూనియర్ కాలేజీల కంటే మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లోనే ఎక్కువగా జరుగుతోందనేందుకు ఇటీవల జరిగిన పలు ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎక్కడో అక్కడ ఈ ర్యాగింగ్ భూతానికి ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఈమధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే విద్యార్థుల ఆలోచన తీరులో కనిపిస్తున్న క్రూరమైన మనస్థత్వం ప్రబలుతోంది. భవిష్యత్ తరాలు ఎలా ఉండబోతున్నాయోననే భయాన్ని రేపుతున్నాయి.
కాలేజీలు, యూనివర్సిటీలతో సహా పలు విద్యాసంస్థల్లో ఈ ర్యాగింగ్ భూతం విజృంభణ కొనసాగుతూనే ఉంది. ర్యాగింగ్ సంఘటనలకు పుల్‌స్టాప్ పడటం లేదు. తెలంగాణ, ఎపిలో ఈ ర్యాగింగ్ జాడ్యం మరింతగా పెరిగిందని, 2015లోనే 90కి పైగా ర్యాగింగ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ర్యాగింగ్ అంటే… సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించేలా ప్రవర్తించడం, ఇది ఇతర దేశాలతో పోల్చితే మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే బలవంతంగా ప్రాణాలు తీసుకునేంతలా ఈ ర్యాగింగ్ భూతం విస్తరిస్తోందని చెప్పేందుకు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలుగా చెబుతున్నారు. అయితే, విద్యార్థలంతా ఒకే మనస్తత్వంతో ఉండరు. కొందరు సున్నిత మనస్కులై చిన్న విషయాలకే ఉద్రేకానికి గురవుతారు. ఇలాంటి వారు పిరికిగా చనిపోవాలనే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు. అలా జరిగిన సంఘటనలు కూడా కోకొల్లలు. ఇంత తెలిసినా ఎక్కడో ఒకచోట ర్యాగింగ్ జరుగుతూనే ఉండటం గమనార్హం.
కఠిన చర్యలకు ఆస్కారం ఉన్నా…!?
ర్యాగింగుకు పాల్పడే విద్యార్థులకు కాలేజీ నుంచి సస్పెన్షన్, విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే పంపేయడం, జరిమానా విధించడం, బహిరంగ క్షమాపణలు చెప్పడం వంటి కఠినమైన శిక్షలు వేసినా సమస్య తగ్గడం లేదు. కాలేజీలో చేరే ముందు ప్రతి విద్యార్థితోనూ కొన్ని విద్యా ంస్థలు ర్యాగింగ్ జరగదనే హామీ పత్రాన్ని కూడా తీసుకుంటుంది. ర్యాగింగ్ జరిగినట్లయితే యాజమాన్యం, ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలని సుప్రింకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ర్యాగింగును అరికట్టేందుకు జాతీయ స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇంతలా నియంత్రణ చర్యలున్నాయని చెబుతున్నా ర్యాగింగ్ రక్కసిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది.
ర్యాగింగ్ రక్కసి కోరల్లో…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ర్యాగింగ్ రక్కసికి బలైంది. ఓ విద్యాకుసుమం నేలవాలింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక వరంగల్ జిల్లా నర్సంపేట లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడవ సంవత్సరం చదువుతున్న రక్షిత తన బంధువుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎపి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం అప్పట్లో ర్యాగింగ్‌కు పరాకాష్టగా నిలిస్తే.. అదే పంథాలో నేడు తెలంగాణలో మెడికో ప్రీతి ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించివేసిందనే చెప్పాలి. తదనంతరం జరిగిన రక్షిత ఘటన మరింత ఆందోళనకు గురిచేసింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని ఐబిఎస్ కాలేజీలో ఓ విద్యార్థిని రూమ్‌లో బందించి కొందరు సీనియర్ విద్యార్థులు చితకబాదారు. పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపర్చిన ఘటన ర్యాగింగ్ రక్కసి వికృత రూపానికి ప్రతీకగా నిలిచింది. బిజెపి ఎంపి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ మహేంద్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ ముసుగులో ఓ విద్యార్థిపై పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
యూజీసీ ఏం చెబుతోంది?
కేంద్రం 1970లోనే ర్యాగింగ్‌ను నిషేధించింది. ఉమ్మడి రాష్ట్రంలో 1997లో చట్టాన్ని తెచ్చారు. అయినా ర్యాగింగ్ ఆగలేదు. 2009లో దేశవ్యాప్తంగా 160కి పైగా ర్యాగింగ్ కేసులు నమోదు కాగా.. 10 మంది బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ర్యాగింగ్ నిరోధానికి యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతికంగానే కాదు, మానసికంగా వేధించినా ర్యాగింగ్ కిందికే వస్తుందని సవరణనూ తెచ్చింది. విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు ఏటా ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేస్తోంది. గత నెలలోనూ వర్సిటీలను హెచ్చరిస్తూ ఆదేశాలిచ్చింది. ర్యాగింగ్ ఘటన బయటపడగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. నిందితులను హాస్టల్/విద్యాసంస్థ నుంచి బహిష్కరించవచ్చు. నేరం రుజువైతే 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తారు.
సినిమా ప్రభావం కూడా ఒకందుకు కారణమా?
సినిమా వ్యామోహం సైతం విద్యార్థులపై పెను ప్రభావం చూపుతోందని అంటున్నారు. సీనియర్ విద్యార్థులను హీరోలుగా చూపుతూ కొన్ని సినిమాలలో ర్యాగింగ్ ఘటనలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఘటనలు కూడా లేకపోలేదని పలువురు చెబుతున్నారు. ఏదిఏమైనా భవిష్యత్తుపై గంపెడాశతో యూనివర్సిటీలు, కాలేజీలు ప్రధానంగా మెడికల్, ఇంజనీరింగ్ విద్యనభ్యసించేందుకు ప్రవేశించే విద్యార్థి, విద్యార్థినుల పాలిట ఈ ర్యాగింగ్ భూతం వెంటాడుతుండటం ఆందోళన కలిగించే పరిణామమే.
ఇప్పటికైనా మేల్కోనేనా…!?
ఏదైనా బలమైన ఘటన జరిగినప్పుడే ఆయా విద్యా సంస్థలు అప్పుడే మేల్కొని ఇదిగో నియంత్రణ కమిటీలు వేస్తున్నాం. ఇక విద్యార్ధి, విద్యార్థినుల భవితకు ఢోకాలేదన్న ప్రగల్భాలకు ఇకనైనా స్వస్తి పలికి ర్యాగింగ్ భూతాన్ని ఆయా విద్యా సంస్థల నుంచి సమూలంగా తరిమికొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు. మరి ఆ దిశగా ఆయా విద్యాసంస్థలు ఎంతమేర రగంలోకి దిగి ఈ ర్యాగింగ్ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించే చర్యలు చేపడతాయో.. వేచి చూద్దాం.