హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండిగా రఘమారెడ్డి బాధ్యతలు చేపట్టి కేవలం ఆరు నెలల్లోనే నిరంతర విద్యుత్ సరఫరాకు చేసిన కృషి అభినందనీయమని ఓయూ వైస్ చాన్స్‌లర్ డి. రవిందర్‌యాదవ్ పేర్కొన్నారు. గురువారం యూనివర్శిటీలో గ్రాడ్యుయే షన్ దినోత్సవం సందర్భంగా ఆయనకు అనులేఖన ధృవీకరణ పత్రం అందజేసి సన్మానించారు. దీనికి తోడు సింగల్ బీడ్ ద్వారా 2 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడం, వినియోగదారుల సేవలకు సంబంధించి వినూత్న పద్దతులను ప్రవేశ పెట్టడం, నూతన సర్వీసులు మంజూరు లో పారదర్శకత కోసం ఐటీ సాంకేతికత ను అమలు చేయడం చేశారని ప్రశంసించారు.
ఆ సంస్థ దాదాపు 48 అవార్డులను ఆందుకున్నది. వాటిలో పలు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు ఉన్నాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన, వీరు చేసిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం రఘుమా రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధిగా ఈ అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా వున్నదన్నారు. అప్పటి గురువులను స్మరిస్తూ ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం అనేది ఉండాలని, లక్ష్యం లేనిదే విజయం వరించదన్నారు. స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సిఎం కెసిఆర్ తనను సీఎండీ గా నియమిస్తూ వీలైనంత త్వరగా రాష్ట్రంలోని అన్ని రంగాల వారికి నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. తాను ఆరు నెలల్లో విద్యుత్ కోతలకు స్వస్తి పలకాలని లక్ష్యం గా పెట్టుకుని, అహర్నిశలు కృషి చేశానన్నారు. కేవలం ఐదు నెలల కాలంలోనే కోతలకు స్వస్తి పలికి నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా సఫలీకృతమైన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బిఎస్ మూర్తి, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ, అధికారులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.