మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మంత్రి రింగ్ రోడ్డు సమీపంలోని 85 ఎకరాల బిలాదాఖలా భూమిని తన కుటుంబ సభ్యుల పేరుమీదకు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. మూడు తరాలుగా అక్కడే ఉంటున్న ఆ గిరిజన రైతులకు పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాటాడారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం, రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం మధ్య చాలా కాలంగా భూవివాదం నడుస్తోందని తెలిపారు.
శంకర్‌పల్లిలోని కొండకల్, రామచంద్రపురంలోని వెలిమెల గ్రామాల మధ్య మిగిలిన సూమారు రూ.1500 కోట్ల విలువైన 85 ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల భూములు కాపాడేందుకు ధరణి స్థానంలో భూమాత చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. అసెంబ్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసిన మంత్రే ఇప్పుడు పేద ప్రజల భుములను లాక్కునేందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళలు, గిరిజనులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పేదలకు జరుగుతున్న ఈ అన్యాయాలపై ఎవరైనా మాట్లాడితే పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఆ భూముల్లోకి ఎవరు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పోలీసుల చేత బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు మూడు రోజులుగా వెలిమెల ఊరవుతల డ్యూటీ చేస్తూ ప్రభుత్వ భూములను ఓ బాడా వ్యక్తికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేపు తాము ఈ ప్రాతాన్ని పరిశీలించబోతున్నామని తెలిపారు. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలోని అమాత్యులు కొందరు హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్నా ఖాళీ స్థలాలు, పేదల స్థలాలు కాజేస్తున్నారని దుయ్యబట్టారు.