Monday, December 23, 2024

20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావను అందించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ రోజూ ప్రార్థనా సమయానికి ముందు విద్యార్థులకు 250 మిల్లీ లీటర్ల రాగిజావను అందించనున్నామని తెలిపారు. దీనివల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి వివరించారు. గురువారం నాడు తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరును మంత్రి సమీక్షించారు.

ఈ నెల 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు.. మన బడి, మన బస్తీ.. మన బడి కింద సకల వసతులతో ఆధునికీకరించిన వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను మంత్రులు, శాసనసభ్యులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని ఒకటి నుంచి ఐదవ తరగతి చదువుతున్న 16,27,457 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ మూడు వర్క్ బుక్‌లు, ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న 12,39,415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒక్కో నోటు పుస్తకం చొప్పున అందించనున్నట్లు మంత్రి చెప్పారు.
20 వేల మంది టీచర్‌లకు టాబ్‌లు అందజేస్తాం
పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు, సమాచార బదలాయింపు కోసం రాష్ట్రంలోని 20 వేల మంది ఉపాధ్యాయులకు టాబ్‌లను అందించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 1,600 పాఠశాలల్లో నిర్మితమైన 4,800 డిజిటల్ తరగతులను విద్యా దినోత్సవం సందర్బంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు సభలు, సమావేశాలను నిర్వహించి రాష్ట్రంలో విద్యారంగంలో సాధించిన విజయాలను వివరించాలని సూచించారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 10 వేల గ్రంథాలయాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. 190 కోట్ల రూపాయలను వ్యయం చేసి 30 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నామని, ఈ పుస్తకాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు 150 కోట్లు వెచ్చించి ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News