న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ బుధవారం ఘాటుగా జ వాబిచ్చారు. ఇది రాజకీయ సమస్య కాదని, దేశ జనాభాలో 90 శాతం ఉన్న బడుగు వర్గాలకు న్యాయం చేయడమే తన జీవితాశయమని రాహుల్ ప్రకటించారు. దేశ భక్తులమని తమను తాము చెప్పుకుంటున్న
వారు కుల గణన ద్వారా దేశానికి ఎక్స్‌రే తీస్తామంటే భయపడిపోతున్నారని రాహుల్ విమర్శించారు. బుధవారం నాడిక్కడ సమృద్ధ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన సామాజిక్ న్యాయ్ సమ్మేళన్‌లో రాహుల్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో విప్లవాత్మకమైన మేనిఫెస్టోగా ఆయన అభివర్ణించారు.
తమ మేనిఫెస్టో చూసి ప్రధాని మోడీ భయకంపితులయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా తాను ఓబిసినంటూ ప్రతిఒక్కరికి చెప్పుకుంటున్న మోడీ తాను కుల గణన గురించి మాట్లాడడం ప్రారంభించగానే అసలు కులమే లేదంటూ మాట్లాడుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత పేద, ధనిక అనే రెండే కులాలు ఉన్నాయంటూ మోడీ చెప్పడం ప్రారంభించారని, ఆయన మాటలే నిజమైతే పేదలను లెక్కిద్దామని, 90 శాతం పేదలు దళితులు, ఆదివాసీలు, ఓబిసిలే ఉంటారని రాహుల్ చెప్పారు.
సంపన్నులలో ఈ కులాల వారు మీకు కనపడరని ఆయన అన్నారు. తనకు ఇది రాజకీయ సమస్య కాదని, ఇది తనకు జీవితాశయమని రాహుల్ చెప్పారు కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమ ప్రథమ ఎజెండా కులగణనేనని ఆయన ప్రకటించారు. దేశంలోని మీడియా, న్యాయ వ్యవస్థ, ప్రైవేట్ ఆసుపత్రులు, బడా కంపెనీలు వంటి రంగాలలో దళితులు, ఆదివాసీలు, ఓబిసిల ఉనికి చాలా తక్కుగా ఉందని ఆయన తెలిపారు. 90 శాతం జనాభా శక్తిని మనం వినియోగించుకోవాలి. తమను తాము దేశభక్తులమని చెప్పుకుంటున్న వారు ఎక్స్‌రే అంటే భయపడిపోతున్నారు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. తన ఆర్థిక ఎజెండాను ఆయన వివరిస్తూ బడా వ్యాపార సంస్థలకు సాయం చేయకూడదని లేదా ప్రోత్సహించకూడదని తాను చెప్పడం లేదన్నారు.