న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారిని అదుపుచేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి దుయ్యబట్టారు. ప్రధాని మోడీ తాను ధరించే లేత గులాబీరంగు కళ్లద్దాలను పక్కనపెట్టాలని, ఆయనకు సెంట్రల్ విస్టా ప్రాజెక్టు తప్ప మరేదీ కనపడడం లేదని రాహుల్ విమర్శించారు. లెక్కలేనన్ని మృతదేహాలు నదులలో కొట్టుకుపోతున్నాయి. ఆసుపత్రుల వద్ద కిలోమీటర్ల కొద్దీ ప్రజులు బారులు తీరుతున్నారు. ప్రజలు జీవించే హక్కును కొల్లగొట్టారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు తప్ప మరేదీ మీకు కనపడని ఆ లేత గులాబీరంగు కళ్లద్దాలను తీసెయ్యండి అంటూ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. కొవిడ్-19పై జరుగుతున్న పోరాటాన్ని బలపరిచేందుకు స్పీక్ అప్ టు సేవ్ లైవ్స్(ప్రాణాలు కాపాడేందుకు మాట్లాడండి) ప్రచారంలో పాల్గొనవలసిందిగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితులలో అవసరమైనవారికి చేయూతనందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఐసియు పడకలు, వ్యాక్సిన్లకు ఏర్పడిన కొరత, వాటి కోసం ప్రజలు అల్లాడుతున్న దృశ్యాలతో కూడిన నిమిషం నిడివిగల ఒక వీడియోను కూడా రాహుల్ షేర్ చేశారు.
Rahul asks Modi to see remove rose tinted glasses