Sunday, November 24, 2024

విధానాల రూపకల్పనకు కుల గణనే పునాది: రాహుల్

- Advertisement -
- Advertisement -

వ్యవస్థ వెలుపలే 90 శాతం జనాభా
రిజర్వేషన్ల సీలింగ్ తొలగించి తీరుతాం
10 శాతం మంది కోసం రాజ్యాంగం లేదు
రాజుల నాటి పాలన కోసం మోడీ ప్రయత్నం
ఏం చేయకూడదో బిజెపి నేతల నుంచి నేర్చుకున్నా
సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో రాహుల్ వ్యాఖ్యలు

ప్రయాగ్‌రాజ్: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి డిమాండు చేశారు. దేశ జనాభాలో 90 శాతం మంది వ్యవస్థ బయట ఉన్నారని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు. విధానాల రూపకల్పనకు కుల గణన పునాదేగాక ముఖ్యమైన సాధనమని కూడా రాహుల్ అభిప్రాయపడ్డారు. శనివారం నాడిక్కడ సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో రాహుల్ ప్రసంగిస్తూ..సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వాములను చేయడానికి ముందు వారి జనాభా సంఖ్యను నిర్ధారించుకోవలసిన అవసరం ఉందని అన్నారు.

కుల గణన లేకుండా దేశ వాస్తవ పరిస్థితిని అవగతం చేసుకోలేమని, విధానాల రూపకల్పనకు కుల గణన అత్యంత ముఖ్యమైన సాధనమేకాక పునాదని కాంగ్రెస్ భావిస్తోందని రాహుల్ నఅద్నరు. ప్రస్తుతం నిత్యం దాడిని ఎదుర్కొంటున్న భారత రాజ్యాంగాన్ని మార్గదర్శకంగా ఎలా పరిగణిస్తున్నామో సామాజిక-ఆర్థిక సర్వే అయిన కుల గణనను కూడా రెండవ మార్గదర్శకంగా తాము పరిగణిస్తామని ఆయన చెప్పారు. దళితులు, ఓబిసీలు, ఇతర వెనుకబడిన కులాలు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలు, ఉన్నత కులాలకు చెందిన జనాభా ఎంత ఉందో తెలుసుకోవడానికి కుల గణన ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. కుల గణన నిర్వహించాలన్న డిమాండు ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తాము ప్రయత్నిస్తున్నామని రాహుల్ అన్నారు. దేశ జనాభాకు చెందిన 10 శాతం మంది కోసం రాజ్యాంగం లేదని, అది ప్రజలందరి కోసం ఉందని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని కాపాడుతున్నది పేద ప్రజలు, కార్మికులు, గిరిజనులేనని, (గౌతమ్)అదానీ కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. 90 శాతం మంది ప్రజలకు భాగస్వామ్య హక్కు లేనిపక్షంలో రాజ్యాంగాన్ని పరిరక్షించలేమని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తమ లక్షమని, పేదలు, రైతులు, కార్మికులకు రాజ్యాంగం రక్షణ కవచమని రాహుల్ ప్రకటించారు. రాజ్యాంగమే లేకపోతే పూర్వకాలంలో ఇష్టారీతిన పాలించిన రాజుల కాలం నాటి పరిస్థితులు ఏర్పడతాయని ఆయన అన్నారు. రాజులు, చక్రవర్తుల తరహా పాలనను తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మిమల్ని మీరు(మోడీ) దైవాంశసంభూతులుగా భావిస్తున్నారు. దేవుడితో మిమల్ని మీరు పోల్చుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజ్యాంగం ముందు మీరు తలవంచవలసి వచ్చింది.

ఇది మేము చేసిన పని కాదు..ప్రజలు చేసిన పని అని రాహుల్ వ్యాఖ్యానించారు. కల గణను నిలిపివేయగలమని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని పెంచడం సాధ్యం కాదని భావించేవాడివి పగటి కలలని, దేశ ప్రజలు కుల గణనకు ఇప్పటికే తమ సమ్మతి తెలిపారని ఆయన అన్నారు. ప్రజల ఆదేశాలు ఇప్పటికే వచ్చాయని, ప్రధాని మోడీ కూడా దాన్ని ఆమోదించి అమలు చేయాలని ఆయన తెలిపారు. ప్రధాని ఆ పని చేయకపోతే ప్రధానిగా మరొకరు వస్తారని రాహుల్ వ్యాఖ్యానించారు. 2004లో తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి బిజెపి పార్టీ నాయకులు తననుచికాకు పరుస్తున్నారని ఆయన అన్నారు. వారిని(బిజెపి నాయకులు) తన రాజకీయ గురువులుగా భావిస్తానని, ఏం చేయకూడదో వారే తనకు నేర్పించారని ఆయన అన్నారు.

బిజెపితో తాను సిద్ధాంతపర పోరాటం సాగిస్తున్నానని, అది కొనసాగుతుంని రాహుల్ తెలిపారు. ప్రధాని మోడీలా కాకుండా తాను తన విధులను బాధ్యతగా పరిగణిస్తానని, తన విధులను ఎవరూ తనకు గుర్తు చేయవలసిన అవసరం లేదని రాహుల్ అన్నారు. నరేంద్ర మోడీ వ్యవహార శైలిని దృష్టిలో ఉంచుకునే ఆయనకు గుర్తు చేయవలసి వస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లో తాను ఒక చర్మకారుడిని కలుసుకున్నానని, ఇతరులెవరూ తనను గౌరవించడం లేదని, చిన్నచూపు చూస్తున్నారని ఆ వ్యక్తి తనతో చెప్పి బాధపడ్డాడని రాహుల్ వివరించారు. ఆ వ్యక్తికి ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ గౌరవం మాత్రం లేదని, అలాంటి వ్యక్తులు వేలాదిమంది మన సమాజంలో ఉన్నారని ఆయన అన్నారు. సమాజంలో అలాంటి వ్యక్తుల భాగస్వామ్యం అవసరమని రాహుల్ చెప్పారు.

చర్మకారులు, క్షురకులు, వడ్రంగులు, ధోబీలు, ఇలా ఎందరో నైపుణ్యం ఉన్న కార్మికులు ఉన్నారని, ఈ కార్మికుల నైపుణ్యాన్ని ఒక నెట్‌వర్క్‌గా మార్చి ఉపయోగించుకునేందుకు అన్ని జిల్లాలలో సర్టిఫికేషన్ సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని రాహుల్ సూచించారు. ఓబిసిలు, దళితులు, కార్మికుల చేతుల్లో ఎంత సంపద ఉందో గ్రహించాలని, న్యాయ వ్యవస్థ లేదా మీడియాతోసహా భారత వ్యవస్థలో వారి భాగస్వామ్యం ఏ మేరకు ఉందని ఆయన ప్రశ్నించారు. దేశంలోని టాప్ కార్పొరేట్ కంపెనీలు, న్యాయ వ్యవస్థ లేదా మీడియాలో 90 శాతం మంంది భారతీయులకు ప్రాతినిధ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 25 మందికి చెందిన రూ. 16 లక్షల కోట్ల రుణాలను ప్రధాని మోడీ మాఫీ చేశారని, కాని ఆ జాబితాలో ఏ ఒక్క దళితుడు, గిరిజనుడు లేదా మైనారిటీ మతస్తుడు లేడని రాహుల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News