ప్రభుత్వంపై రాహుల్ విమర్శ
న్యూఢిల్లీ: చర్చలు జరిగితే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయన్న భయంతోనే ఎటువంటి చర్చలేకుండా మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించుకున్నట్లు కనపడుతోందని కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గడచిన ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,రైతులు, కార్మికుల బలం ముందు ముగ్గురు, నలుగురు ఇష్టులైన పెట్టుబడిదారుల అధికార బలం నిలబడలేదని గ్రహించే ఈ మూడు బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకోక తప్పదని తమ పార్టీ ఎప్పుడో చెప్పిందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులు రద్దు కావడం రైతులు, దేశ ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు. అయితే చర్చ లేకుండా బిల్లులు రద్దు కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వ్యవసాయ బిల్లులను తీసుకురావడం వెనుక ఉన్న శక్తుల గురించి చర్చించాలని తమ పార్టీ ఆశించిందని ఆయన చెప్పారు. తాము కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) గురించి, లఖింపూర్ ఖేరీ ఘటన గురించి, ఆందోళన సందర్భంగా మరణించిన 700 మంది రైతుల గురించి పార్లమెంట్‌లో చర్చించాలని తాము భావించామని, అయితే దురదృష్టవశాత్తు అది జరగలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.