మధ్యప్రదేశ్: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అగ్రనేతకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో విస్తరిస్తున్న ద్వేషం, హింస, భయాలకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.
కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లోకి తీసుకుని భారత్ జోడో యాత్రను ప్రారంభించామని తెలిపారు. ఈ త్రివర్ణ పతాకాన్ని శ్రీనగర్ చేరుకోకుండా ఎవరూ ఆపలేరన్నారు. బిజెపి పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. యువత, కార్మికులు, రైతుల మనస్సుల్లో భయం నింపుతున్న బిజెపి దాన్ని హింసగా మలుస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాహల్ 12 రోజులు పాదయాత్ర చేయనున్నారు. దాదాపు 380 కిలో మీటర్లు నడిచి రాజస్థాన్ చేరుకోనున్నారు.