రాహుల్‌కు జాతీయ పతాకం అందచేయనున్న స్టాలిన్
న్యూఢిల్లీ: ఈ నెల 7వ తేదీన ”భారత్ జోడో యాత్ర”ను ప్రారంభించడానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకం వద్ద ప్రార్థనా సమావేశంలో పాల్గొనడంతోపాటు కన్యాకుమారిలోని మహాత్మా గాంధీ మండపం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ వేదిక వద్దనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాహుల్ గాంధీకి జాతీయ పతాకాన్ని అందచేయనున్నారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు 3,570 కిలోమీటర్ల పాదయాత్రను సెప్టెంబర్ 8న ఉదయం 7 గంటలకు రాహుల్ ప్రారంభిస్తారని శుక్రవారం వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 11న యాత్ర కేరళ చేరుకుని 18 రోజుల పాటు కేరళలో సాగిన అనంతరం సెప్టెంబర్ 30న కర్నాటకలోకి ప్రవేశిస్తుంది. 21 రోజులు కర్నాటకలో కొనసాగే యాత్ర ఇతర రాష్ట్రాల మీదుగా శ్రీనగర్ వరకు సాగుతుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమై తిరువనంతపురం, కోచ్చి, నిలంబూర్, మైసూర్, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌస, ఆల్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్మూ మీదుగా సాగి శ్రీనగర్‌లో ముగుస్తుంది.