కాంగ్రెస్ సారథ్యంపై రాహుల్ వ్యాఖ్యలు
కన్యాకుమారి(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ చేపట్టడంపై తాను ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చానని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినపుడు దీనికి తాను సమాధానం చెబుతానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శుక్రవారం రెండవ రోజు భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన విలేకరుల ప్రశ్నకు జవాబిస్తూ తాను ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నానని, తనకు చాలా స్పష్టత ఉందని, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగినపుడు తాను సమాధానం ఇస్తానని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తిరిగి చేపట్టడంపై ఆయన ఇప్పటికీ నిరాసక్తతను కనబరుస్తూ వస్తున్నారు. అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టడంపై విలేకరులు పదేపదే ప్రశ్నించగా&పార్టీ ఎన్నికలు జరిగినపుడే తాను తిరిగి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టేది లేనిది తేలుతుందని, అప్పటివరకు వేచి ఉండాలని రాహుల్ విలేకరులకు చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీరుకు చేపట్టిన భారత్ జోడో యాత్రకు తాను నాయకత్వం వహించడం లేదని, తాను ఈ యాత్రలో కేవలం పాల్గొంటున్నానని ఆయన అన్నారు. దేశం కోసం పనిచేయవలసిన బాధ్యత ప్రతిపక్షంలో ప్రతిఒక్కరిపై ఉందని కూడా ఆయన చెప్పారు.