న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందచేయాలని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిజెపి విధానాలకు దేశ ప్రజలు బలి కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మాట్లాడింది చాలని, దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ జరగాలని రాహుల్ అన్నారు. బిజెపి విధానాలకు దేశ ప్రజలను బలి చేయకూడదని ఆయన సోమవారం హిందీలో ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానాన్ని రాహుల్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్రతోపాటు గుజరాత్, ఒడిషా, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా టీకా అందచేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. అయితే, వ్యాక్సిన్ నిల్వలను కేంద్రం వాటి తయారీదారుల నుంచి చేజిక్కించుకుని తన వద్ద ఉంచుకుంటున్నట్లు కాంగ్రెస్ పాలనలో ఉన్న నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియ మొదలుకావడంపై ఆయా రాష్ట్రాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.